ప్రజా పోలీస్... ప్రభుత్వ లక్ష్యం

17 Jul, 2014 23:31 IST|Sakshi
ప్రజా పోలీస్... ప్రభుత్వ లక్ష్యం

సంగారెడ్డి మున్సిపాలిటీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు లండన్ తరహాలో నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇందుకోసం 3జీ, 4జీ టెక్నాలజీ గల వాహనాలతో పాటు గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించేందుకు 1,500 మోటర్ సైకిళ్లు, 2వేల సీసీ కెమెరాలు ఉపయోగిస్తామన్నారు. గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరాలను అరికట్టేందుకే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా సంఘటన జరిగితే 10 నిమిషాల్లోపు సంఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసు శాఖకు అధునాతన టెక్నాలజీ గల 1,650 ఇన్నోవా వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. అంతేకాకుండా సున్నిత ప్రాంతాలకు పోలీసులు వేగంగా చేరుకునేందుకు 1,500 మోటర్ సైకిళ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు.
 
 డీజీపీ, డీఐజీ పర్యవేక్షణలో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసి నేరాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లను మూసివేయించామని, జిల్లా స్థాయిలో కూడా అలాంటి క్లబ్‌లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిరంతర ప్రజాసేవలో ఉండే పోలీసులు కుటుంబంతో కలిసి ఓ రోజు గడిపేందుకు వారాంతపు సెలవు మంజూరు చేస్తున్నామన్నారు. పోలీసుల యూనిఫాంపై కూడా చర్చిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు ఎస్పీలకు ఉత్తర్వులిచ్చామన్నారు.
 
 జెన్‌కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి
 విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని హోంమంత్రి తెలిపారు. జెన్‌కో ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అందువల్ల ప్రభుత్వమే జెన్‌కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుందని నాయిని తెలిపారు. నిధులు...నీరు...ఉద్యోగం తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ మేరకు పాలన ఉంటుందన్నారు. సమావేశంలో కార్మిక శాఖ జాయింట్ సెక్రటరీ అజయ్, డి ప్యూటీ సెక్రటరీ నరేశ్‌కుమార్, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌లు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు