గృహ నిర్మాణ అక్రమాలపై సర్కారు దృష్టి

10 Jul, 2014 02:06 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గృహ నిర్మాణశాఖ అక్రమాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. నివాస గృహాల బిల్లుల మంజూరులో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది. అక్రమార్కులు కాజేసిన సొమ్మును కక్కించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఎన్ని నివాసాలు మంజూరయ్యాయి.

వాస్తవానికి కట్టిన గృహాలెన్ని? ఎన్ని గృహాలకు బిల్లులు డ్రా చేశారు? వంటి వివరాలు సేకరించాలని గృహ నిర్మాణశాఖ హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ గంగారాం తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హ్యాబిటేషన్లవారీగా వివరాలు సేకరించాలని ఆదేశించామని అన్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైన కేసుల్లో బాధ్యుల వద్ద ఆ మొత్తాన్ని రికవరీ చేసే అంశంపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కొన్నేళ్లుగా గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలు తవ్వి తీసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల హైదరాబాద్‌లో ‘నవ తెలంగాణ సమాలోచన’లో సీఎం కేసీఆర్ గృహ నిర్మాణ శాఖలోని అక్రమాల అంశాన్ని ప్రస్తావించారు.

 రూ.50 కోట్లకు పైగా అక్రమాలు
 నిలువ నీడలేని నిరుపేదల కోసం అమలు చేసిన గృహనిర్మాణ పథకాలు అక్రమాలకు వరంగా మారాయి. క్షేత్రలో స్థాయి నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు. అసలు ఇళ్లే నిర్మించుకోకుండా బిల్లులు కాజేశారు. ఒకే ఇంటిపై నాలుగైదు బిల్లులు డ్రా చేశారు. ఒకే వ్యక్తి బినామీ పేర్లతో గృహాలు మంజూరు చేసుకుని భారీ భవనాలను నిర్మించుకున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో గృహాల బిల్లులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి.

ఈ అక్రమాలపై గతంలో థర్డ్ పార్టీతో విచారణ జరిగింది. ర్యాండమ్ సర్వేలో భాగంగా జిల్లాలో 73 గ్రామాల్లో సర్వే నిర్వహించగా భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. సుమారు 1,582 గృహాలకు సంబంధించిన రూ.2.93 కోట్ల మేరకు బిల్లులు కాజేసినట్లు రుజువైంది. ఇందుకు బాధ్యులుగా పలువురు గృహ నిర్మాణ శాఖ అధికారులపై అప్పట్లో వేటు వేశారు. ఐదుగురు ఏఈలను విధుల నుంచి తొలగించగా, తొమ్మిది మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను కూడా విధుల నుంచి తొలగించారు. ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేవలం సర్వే జరిగిన 73 గ్రామాల్లోనే రూ.కోట్లలో అక్రమాలు జరిగితే జిల్లా వ్యాప్తంగా పక్కదారి పట్టిన మొత్తం సుమారు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ అక్రమాలపై ప్రస్తుత సర్కారు ఇప్పుడు దృష్టి సారించింది.

 రూ.960 కోట్లు.. 3.45 లక్షల గృహాలు..
 వివిధ గృహ నిర్మాణ పథకాల కింద 2006 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3.45 లక్షల గృహాలు మంజూరయ్యాయి. ఇందులో మూడు విడతలుగా అమలైన ఇందిరమ్మ పథకం కింద 2.72 లక్షల గృహాలు మంజూరు కాగా, మూడు విడతల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరో 46,982 నివాసాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవికాకుండా మరో 47,553 గృహాలు మంజూరు చేస్తూ గత ప్రభుత్వం 2013లో జీవో నంబర్ 23ను జారీ చేసింది. ఈ గృహాలపై ఇప్పటివరకు రూ.960.10 కోట్లు మేరకు ప్రభుత్వం ఖర్చు చేసింది.

మరిన్ని వార్తలు