ఎగ్‌గొట్టారు!

28 Aug, 2015 01:22 IST|Sakshi
ఎగ్‌గొట్టారు!

వారానికి ఒకరోజుతోనే సరి..
కొన్నిచోట్ల అరటిపండే దిక్కు
అక్కడక్కడా శ్రావణమాసం పేరుతో ఎగవేత
పట్టించుకోని అధికారులు
గవర్నర్ ఆదేశించినా ఫలితం శూన్యం
 
 పాలమూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, వారి ఆకలి తీర్చేందుకు పౌష్టికాహారం అందించేందుకు, సామాజిక అసమానతలను తగ్గించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. బిల్లులు సకాలంలో అందించకపోవడం, పర్యవేక్షణ లేని కారణంగా ఏ పాఠశాలలోనూ మెనూ సక్రమంగా పాటించడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి రెండు రోజులు (సోమ, గురు) గుడ్డు ఇవ్వాలని నిర్ణయించినా బిల్లులు రాలేదనే సాకుతో చాలా పాఠశాలల్లో గుడ్డు వడ్డించడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం గురువారం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వాలి,  కానీ, గురువారం జిల్లాలోని అనేక పాఠశాలల్లో గుడ్డు ఇవ్వలేదు. ఈ విషయం ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో వెల్లడైంది.

 జిల్లావ్యాప్తంగా ఇది పరిస్థితి..:
 జిల్లా వ్యాప్తంగా 2,672 ప్రాథమిక పాఠశాలల్లో 2,52,850 మంది విద్యార్థులు, 579 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,24,613 మంది, 586 ఉన్నత పాఠశాలల్లో 68,822 మంది ఉన్నారు. మొత్తం 3,837 పాఠశాలల్లో 4,46,285 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35 పైసలు, 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.38 చొప్పున ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తుంది. బిల్లులు సకాలంలో చెల్లించక పోవడం వల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

 అమలు కాని మెనూ..
 ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సోమవారం గుడ్డు, సాంబార్‌తో భోజనం, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, ఆకుకూరలు, గురువారం గుడ్డు, సాంబర్, శుక్రవారం కూరగాయలు, శనివారం పప్పు ఆకుకూరలు పెట్టాలని ప్రభుత్వం మెనూ నిర్ణయించింది. కానీ ధరలు పెరిగిన సాకుతో చాలా పాఠశాలల్లో మెనూ అమలు చేయడం లేదు. చాలా పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం లేదు. శ్రావణమాసం విద్యార్థులు తినడం లేదని కొన్ని పాఠశాలల్లో సాకులు చెబుతుండగా, విద్యార్థులు మాత్రం తమకు ఒక్కరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారని, కొన్ని పాఠశాలల్లో అసలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.

 మూడు నెలలుగా అందని బిల్లులు..  
 మధ్యాహ్న బోజనం వండి పెట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చింది. విద్యార్థులకు సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 1 నుంచి 5మంది కార్మికుల వరకు పనిచేస్తున్నారు. వారికి ప్రతి నెలా ’వెయ్యి చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండగా సరకులు, కూరగాయల కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెట్టేందుకు నిర్హాహకులకు ప్రత్యేకంగా బిల్లులిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి.

పెరిగిన ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో విద్యార్థులకు వండిపెట్టడం గిట్టుబాటు కావడం లేదని మహిళలు మహిళలు వాపోతున్నారు.  బిల్లులు మూడు నెలలుగా ఇవ్వలేదని వంట ఏజేన్సీల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు నెలా నెలా ఇవ్వాల్సిన వేతనం ’వెయ్యి కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం కోసం ట్రెజరీలో రూ.12.74కోట్లు అందుబాటులో ఉన్నా ఎంఈఓల నిర్లక్ష్యం కారణంగా చాలా పాఠశాలలకు అందడం లేదు.
 
 ఒక్కరోజు గుడ్డు ఖర్చు రూ.13లక్షలు..
 జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 4,46,285 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. మెనూలో ఒక్కరోజు గుడ్డు విద్యార్థులకు ఇస్తే గుడ్డు ధర సరాసరి రూ.3 చొప్పున వేసుకున్నా ప్రతి రోజు విద్యార్థుల సంఖ్య ప్రకారం రూ.13,38,855 ఖర్చు అవుతుంది. ఒక్కరోజు విద్యార్థులకు గుడ్డు ఇవ్వకుంటే ఇంతేమొత్తంలో మిగులుతుంది. ఇలా వారానికి ఒకరోజు గుడ్డు ఇవ్వకుండా ఉంటే నెలలో రూ.1.07కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్లే.

మరిన్ని వార్తలు