పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు

19 Nov, 2016 01:08 IST|Sakshi
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు

- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు
- 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు
 
 సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది.

సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు