హైకోర్టు తీర్పుతో జేఎన్టీయూహెచ్ డైలమా

26 Aug, 2014 00:44 IST|Sakshi
  • గుర్తింపు కోసం యాజమాన్యాల పడిగాపులు  
  •  తీర్పు ప్రతి అందాకే తదుపరి నిర్ణయమన్న రిజిస్ట్రార్
  • సాక్షి, సిటీబ్యూరో/మలేషియన్ టౌన్‌షిప్: ప్రైవేటు కళాశాలలకు అఫిలియేషన్ విషయమై హైకోర్టు వెలువరించిన తీర్పుతో జేఎన్టీయూహెచ్ అధికారులు డైలామాలో పడ్డారు. అర్హతలున్న కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని గురువారం హైదరాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

    లోపాలు ఉన్నాయనే నెపంతోనే 174 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిలిపివేసిన జేఎన్టీయూహెచ్‌కు, వీటిలో అర్హతలున్న కళాశాలలను ఎంపిక చేయడం కత్తిమీద సామే. కొన్ని కళాశాలలకు అవకాశం కల్పిస్తే.. విగినవాటితో వివాదం తప్పేలా లేదు. అలాగని.. హైకోర్టు ఆదేశాలను అమలు పరచకుంటే పరిస్థితి మరింత క్లిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
     
    ఎటూ తేల్చుకోలేని వైనం..
     
    జేఎన్టీయూహెచ్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సిబ్బంది, లాబొరేటరీలు తదితర వసతులు లేవంటూ వర్సిటీ  అకడమిక్ ఆడిట్ సెల్ నుంచి యాజమాన్యాలకు గత వారం నోటీసులు అందాయి. వీటిపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో డీ అఫిలియేషన్ వేటుకు గురైన 174 కళాశాలల యాజమన్యాలు.. లోపాలను సవరించుకున్నామని, తక్షణం తమకు వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని రిపోర్టు సమర్పించాయి. హైకోర్టు తీర్పు కూడా తమకు సానుకూలంగా రావడంతో.. వర్సిటీ అధికారుల అనుమతి కోసం మంగళవారం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు జేఎన్టీయూహెచ్‌కు వచ్చారు. సాయంత్రం వరకు వీసీ, రిజిస్ట్రార్ తమ కార్యాలయాలకు రాకపోవడంతో నేరుగా రిజిస్ట్రార్ ఇంటికే వెళ్లి కలిశారు.

    అయితే, హైకోర్టు తీర్పు కాపీ అడ్వకేట్ జనరల్ నుంచి తమకు ఇంకా అందలేదని, కాపీ అందాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యాలతో రిజిస్ట్రార్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై వీసీ, రిజిస్ట్రార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా వారు స్పందించలేదు. అయితే, వెబ్ కౌన్సెలింగ్‌కు కొన్ని కళాశాలలకు అనుమతి ఇచ్చి, మరికొన్నింటికి ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు