ఇక ఇంటి ముందుకే ఇసుక !

7 Dec, 2014 03:08 IST|Sakshi
ఇక ఇంటి ముందుకే ఇసుక !
  • కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం  నేడోరేపో ఉత్తర్వులు
  • సాక్షి, హైదరాబాద్: మీకు ఇసుక అవసరం ఉందా..?  ఇక దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్, ఈ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తారు. సీనరేజి చార్జీలు, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు. ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేసేం దుకు నిర్ణయించిన టీ సర్కార్ ఇసుకపై కొత్త విధానం ప్రకటించనున్నట్టు తెలిసింది. దీనికి మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. దీనిపై నేడోరేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
     
    స్థానికులకు సీనరేజి ఉండదు

    తెలంగాణ ప్రాంతంలో నదులు, వాగులు, రిజర్వాయర్లలో డీ సిల్టింగ్, ప్రైవేట్ భూముల్లో డీసిల్టింగ్ చేయడం ద్వారా ఇసుక లభ్యత ఉంటుందని తెలి పింది. ఇసుకను 5 రకాలుగా విభజించారు. అందులో ఒకటి, రెండు రకాలుగా నిర్ధ్దారించిన వాటిలో ఇసుక రీచ్‌లను స్థానిక సంస్థలకు వదిలేస్తారు. స్థానికులు వీటి నుంచి గృహావసరాలు, స్కూల్ భవనం, కమ్యూనిటీ హాల్స్‌కు ఎలాంటి సీనరేజి చెల్లించకుండా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని కమిటీ తెలిపింది.

    యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదు.  గ్రామపరిధి దాటి రవాణా చేయడానికి వీల్లేదు. కేటగిరీ 3, 4, 5లకు సంబంధించి ఇసుక తవ్వకాలకు ‘వాల్టా’  చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. ఈ 3 కేటగిరీల్లో ఇసుక రీచ్‌లను గనులు, భూగర్భవనరుల శాఖ యంత్రాంగం నీటిపారుదల, రెవెన్యూ, భూగర్భ జలవనరులను సంప్రదిస్తుందని వివరించారు.
     
    జేసీల ఆధ్వర్యంలో కమిటీ

    తుంగభద్ర నది ఎడమవైపు, కృష్ణా, గోదావరి, రిజర్వాయర్ల బ్యాక్‌వాటర్, ఈ నదుల ఉపనదులు, రిజర్వాయర్లలో ఇసుక డీ సిల్టింగ్‌ను ఆ శాఖ గుర్తిస్తుందని మంత్రి ఉపసంఘం తెలిపింది. తరువాత సంబంధిత జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఇసుక రీచ్‌లకు సంబంధించి సాధ్యాసాధ్యాలను వాల్టా చట్టానికి లోబడి నిర్ణయిస్తుంది. వీటిలో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, సరఫరా బాధ్యతను తెలంగాణ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఎండీసీ)కు అప్పగించనున్నట్టు పేర్కొంది.

    దీని కోసం అన్ని అనుమతులను టీఎస్‌ఎండీసీ నుంచి తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ‘పెసా’ చట్టం ప్రకారం ఇసుక విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు వసూలు చేస్తున్న సీనరేజి రూ. 40ను పెంచాలని ఉపసంఘం సిఫారసు చేసింది. ప్రస్తుతం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే.. నియంత్రణ పెంచాలని నిర్ణయించింది.
     
    వేధింపుల కట్టడికే..

    ఇసుక రీచ్‌ల నుంచి రవాణా చేసే సమయంలో అధికారుల వేధింపుల నుంచి తప్పించడానికి కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది. తక్కువ ధరకు ఇసుక ప్రజలకు అందించాలన్న ఉద్దేశం మేరకు ప్రభుత్వమే సరఫరా చేయనుంది, ఇసుక కావాల్సిన వ్యక్తికి సొంత రవాణా వ్యవస్థ ఉంటే, సీనరేజి చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.  

    ఇక గతంలో క్వారీల అనుమతి తీసుకుని డబ్బు చెల్లించకుండా, వినియోగించుకుండా ఉన్న వాటిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఖరీదైన డోలమైట్, సున్నపురాయి, ఐరన్‌ఓర్, గ్రానైట్, బంగారం, వజ్రాలను బహిరంగ వేలంలో విక్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. క్వారీలకు నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇచ్చే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తహశీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
     

మరిన్ని వార్తలు