అమరుల త్యాగ స్మరణయే మొహర్రం

3 Nov, 2014 00:01 IST|Sakshi

దోమ: ఇస్లాం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునే మాసమే మొహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి మాసంగా పేర్కొంటారు.  ఇరాక్‌లోని కర్బలాలో  జరిగిన యుద్ధంలో శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన ఇమామ్ హుస్సేన్, హస్సన్, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని స్మరించుకునేందుకు  ఏటా ఈ మాసంలో సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 మంగళవారం మొహర్రం నేపథ్యంలో పది రోజుల క్రితమే గ్రామాల్లో చావిడీలను ప్రత్యేకంగా అలంకరించి వాటిలో పీర్లను ప్రతిష్టించారు. అప్పటి నుండి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మొహర్రం అనే పేరు హరం అనే ఉర్దూ పదం నుండి వచ్చిందని చెబుతుంటారు. హరం అంటే  త్యాగం, క్షమాపణ అని అర్థం.

మొహర్రం సందర్భంగా పలు చోట్ల ముస్లింలు ఛాతీ బాదుకుంటూ, రక్తం చిందిస్తూ మాతం యాత్ర నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి సంతాపం తెలుపుతారు.మొహర్రం గ్రామాల్లో మతసామరస్యానికి వేదికగా నిలుస్తోంది. చాలా గ్రామాల్లో పీర్లను ముస్లింలతో సమానంగా హిందువులు దర్శించుకొని పూజలు చేస్తారు. హిందువులు మాతం యాత్రలోనూ పాల్గొని ముస్లింలకు సంఘీభావం తెలపడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది.

ముస్లింల సంఖ్య తక్కువగా ఉండే గ్రామాల్లో హిందువులే ముందుండి మొహర్రం కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దోమ మండల పరిధిలోని పాలేపల్లి, దోమ, మోత్కూర్, దిర్సంపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం నాడు ఏటా ఘనంగా పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు. పది రోజుల పాటు చావిడీల్లో దర్శనార్థం ఉంచిన పీర్లను మంగళవారం నెలవంక దర్శనం కాగానే మాతం యాత్ర చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు