గువ్వలగుట్ట.. రోగాల పుట్ట

5 Feb, 2015 02:26 IST|Sakshi
గువ్వలగుట్ట.. రోగాల పుట్ట

80శాతం మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి
పిట్టల్లారాలుతున్న జనం   పట్టించుకోని అధికారగణం, పాలకులు

 
గువ్వలగుట్ట... చందంపేట మండలంలోని ఓ కుగ్రామం. దేవరకొండకు60 కిలోమీటర్ల దూరంలో సాగర్ తీర ప్రాంతమది. కూత వేటు దూరంలోనే సాగర్ జలాశయం కన్పిస్తున్నా కనీసం గుక్కెడునీటికి నోచుకోని దుస్థితి. 650 మంది జనాభా ఉన్న ఈ గ్రామాన్ని కొన్నేళ్ళుగా ఓ  మహమ్మారి పట్టి పీడిస్తోంది.  కిడ్నీ సంబంధిత వ్యాధులతో  బాధపడుతూ ఇప్పటికే వందల మంది మృత్యువాతపడ్డారు. గ్రామంలో కిడ్నీ సంబంధితవ్యాధితో బాధపడని ఒక్క వ్యక్తి కూడా కనిపించడంటే  అతిశయోక్తి కాదేమో.     
 - దేవరకొండ
 
దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామంలో 80శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీల్లో సుద్దగడ్డలు తయారుకావడం, తరచు కడుపునొప్పితో బాధపడడం, సరిగ్గా లేచి నిలబడి పని చేసుకోలేకపోవడం, మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వందల మంది కిడ్నీ ఆపరేషన్లు     చేయించుకున్నారు. ఎవ్వరి నడుముకు చూసినా ఆపరేషన్ గాట్లే కనిపిస్తాయి. ప్రతి ఏటా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కష్టపడి పోగేసిందంతా ఆపరేషన్‌తో పాటు మందుల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలలో సగం రోజులు ఆస్పత్రుల చుట్టే తిరగడం వీరికి పరిపాటిగా మారింది.

మృత్యుభేరి

అయిదారేళ్ల కాలంలో ఈ గ్రామంలో వందల మంది పిట్టల్లా రాలిపోయారు. అయితే వీరు వయస్సుడిగి చనిపోయిన వారేంకాదు. ఇటీవల కాలంలో చనిపోయిన వారంతా 30 నుంచి 45  సంవత్సరాలలోపే కావడం గమనార్హం. ఇటీవల కాలంలో రమావత్ అమర్‌సింగ్, వడ్త్య బిచ్య, పెద్ద అమర్య, రమావత్ ఢాక్యా, రాజి, మూఢావత్ జాను, సోమ్లానాయక్, మాన్యానాయక్, రమావత్ సోమ్లా, వెంకట్.. ఇలా చాలా మంది కిడ్నీ సంబంధిత రోగాలతో మృత్యువాత పడ్డారు. ఇక ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. సాక్షి ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాపాయ స్థితిలో గోపి

 గ్రామానికి చెందిన రమావత్ స్వామి కుమారుడు గోపి. 12 సంవత్సరాల వయస్సున గోపి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతనికి ఒక కిడ్నీ ఇప్పటికే చెడిపోగా మరో కిడ్నీకి కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం గోపి ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.

గుక్కెడు నీరు కరువు

గువ్వగుట్ట ప్రజలకు కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యంలేదు. సాగర్ జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా మంచినీటిని అందించాలని ఎన్ని సార్లు ప్రజలు అడిగినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గ్రామంలో ఉన్న బోరు వాటర్‌పైనే జనం ఆధారపడ్డారు. ఊళ్లో వేసిన బోరు ద్వారా మంచినీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. అయితే గ్రామంలో ఎక్కువశాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడడానికి మూల కారణమేమిటనే విషయాన్ని తేల్చడానికి అధికారులు ఇంతవరకూ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.  

 ఎన్నికలప్పుడే..

ఎన్నికలప్పుడు ఓట్లు అడగటానికి మాత్రమే పా లకులు ఈ గ్రామానికి వస్తుంటారు. అయిదారేళ్ల క్రితం వరకు ఈ గ్రామాన్ని పట్టించుకోలే దు. కానీ ఇటీవల పాలకులు ఆ గ్రామంపై దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించారేత ప్ప ఈ సమస్యను మాత్రం తీర్చలేకపోయారు.
 
 

మరిన్ని వార్తలు