నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

22 Sep, 2017 07:28 IST|Sakshi

ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్‌:
తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. భేటీపై ఇప్పటికే బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ ఏపీ, తెలంగాణకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో జరిగే భేటీకి బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ఛటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు హాజరుకానున్నారు. తమ తాగునీటి అవసరాలకుగానూ మొత్తంగా 17 టీఎంసీలు అవసరమని తెలిపిన ఏపీ, పోతిరెడ్డిపాడుకు 5 టీఎంసీలు, ముచ్చమర్రి ద్వారా హంద్రీనీవాకు 5, సాగర్‌ కుడి కాల్వలకు 7 టీఎంసీలు కావాలని కోరింది.

నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లా తాగు నీటి అవసరాలకు 40.10టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా శ్రీశైలం ఎడమ కాల్వ పరిధిలో 40 వేలు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 1,500 క్యూసెక్కుల నీటిని తెలంగాణ అక్రమంగా తోడుకుంటోందని బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు గురువారం తెలంగాణను వివరణ కోరింది. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా చేస్తున్న వినియోగంపై ఇప్పటికే తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై శుక్రవారం నాటి భేటీలో చర్చించే అవకాశం ఉంది.

కాగా త్రిసభ్య కమిటీ భేటీలో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలపై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌తో చర్చించారు. మిషన్‌ భగీరథతోపాటు వచ్చే జూన్‌ నాటికి అవసరమయ్యే నీటిని తీసుకునేలా ఒప్పించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 120 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో సాగర్‌కు తక్షణమే జలా లు విడుదల చేసేలా చూడాలని కోరాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు