13 వేల మందికో బార్

22 Jun, 2016 02:10 IST|Sakshi

విస్తీర్ణాన్ని బట్టి లెసైన్స్ ఫీజు వసూలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త బార్ల పాలసీ తుది రూపు దిద్దుకుంటోంది. 2016-17 సంవత్సరానికి వర్తించే ఈ పాలసీ తుది ముసాయిదాను ఆబ్కారీ శాఖ సోమవారం ప్రభుత్వానికి పంపించింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. కొత్త పాలసీలో బార్ల లెసైన్సు ఫీజులను విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 3 స్లాబుల్లోని ఫీజులను యథాతథంగానే కొనసాగించనున్నారు. జనాభా ఆధారంగా 13 వేలకు ఒక బార్ చొప్పున లెసైన్సులు మంజూరు చేయనున్నారు.

బార్లలో మద్యం సరఫరా చేసే ఏరియా 500 చదరపు మీటర్ల వరకు ఇప్పుడున్న ఫీజులు వర్తిస్తాయి. 500 నుంచి 700 చదరపు మీటర్లు ఉంటే 10 శాతం, 700 నుంచి 1,000 చదరపు మీటర్లు ఉంటే 20 శాతం, వెయ్యి చదరపు మీటర్ల పైన ఉన్న బార్లు 40 శాతం అదనంగా ఫీజు చెల్లించాలి. నగరంలో 70కి పైగా ఉన్న స్టార్ హోటళ్లను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైవేలకు వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిబంధనలు రాష్ట్రంలో వర్తించవని తేల్చిన నేపథ్యంలో గతంలో తిరస్కృతికి గురైన బార్ల దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 98 వరకు బార్లను ఏర్పాటు చేసే వెసులుబాటు లభించనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు