మ్యాజిక్‌తో దొంగ బాబాల చలామణి

17 Feb, 2015 00:45 IST|Sakshi

జనవిజ్ఞాన వేదిక అంతర్జాతీయ స్థాయి మెజీషియన్, ప్రొఫెసర్ రమేష్
సలసల కాగే నూనెలో చేతితో బజ్జీలు తీసిన మహిళలు
ఎర్రటి నిప్పులపై నడక జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రదర్శనలు

 
నాచినపల్లి(దుగ్గొండి) :  భక్తులను నమ్మించి మోసం చేసే దొంగ బాబాలవి మహిమలు కావని, అవి కేవలం ఇంద్రజాల ప్రదర్శన మాత్రమేనని జనవిజ్ఞాన వేదిక అంతర్జాతీయ స్థాయి మెజీషియన్, ప్రొఫెసర్ రమేష్ అన్నారు. మండలంలోని నాచినపల్లి గ్రామం లో ఆదర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక వారి సౌజన్యంతో ఆదివారం రాత్రి మూఢ నమ్మకాలపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రసంగించడంతోపాటు ఇంద్రజాల ప్రదర్శనలు చేశారు. ఎర్రటి నిప్పులపై గ్రామస్తులను నడిపించారు. సలసల కాగే నూనెలోని బజ్జీలను మహిళల చేత చేతులు పెట్టి తీయించారు. ఎందుకు కాలదో స్వయంగా సైన్స్‌పరంగా వివరించారు.

దయ్యాలు, భూతాలు, అర చేతిలో విభూతి సృష్టించడంలాంటి అనేక ప్రదర్శనలు చేసి చూపించారు. వ్యాఖ్యాతగా వనప్రేమి అవార్డు గ్ర హీత రాయబోసు వ్యవహరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, రాములు, జగదీష్‌బాబు, దయానంద్, ఎర్రన్న, ఆదర్శ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బొమ్మినేని నర్సింహారెడ్డి, మురళి, దేవేందర్, ప్రవీణ్, ప్రభాకర్, తిరుపతి, లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, పద్మారావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు