జాతీయ రహదారిపై ఓమిని వ్యాన్ దగ్ధం

3 Feb, 2015 04:21 IST|Sakshi
జాతీయ రహదారిపై ఓమిని వ్యాన్ దగ్ధం

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాంపల్లి శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓమిని వ్యాన్ దగ్ధమైంది. ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్‌పల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన ఓమిని వ్యాన్‌లో డ్రైవర్ రమేశ్ ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక షార్ట్ సర్క్యూట్‌తో వ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో రమేశ్ భయంతో కిందకు దిగిపోయాడు. అదే సమయంలో నవయుగ టోల్‌ఫ్లాజా హై వే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ఆం దోళనకు గురయ్యారు. ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా తలగబడిపోయిం ది. వ్యాన్‌లో డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ వ్యాన్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలువడంతో మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల కుటుంబీకులు కలవరానికి గురయ్యారు.

ప్రాణనష్టం జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ ఓమినీ వ్యాన్‌ను సొంత పనులకు వాడుతాం. డ్రైవర్ స్కూల్ బస్సులో పిల్లలను ఇళ్లల్లో దింపి వచ్చిన తర్వాత, పనుందని అడగటంతో వ్యాన్‌లో వెళ్లమని చెప్పాను. ప్రాణనష్టం జరగక పోవడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని స్కూల్ కరస్పాండెంట్ గంగారాం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు