కరెంటోళ్లు.. కదలరు..మెదలరు!

16 Mar, 2014 02:45 IST|Sakshi
కరెంటోళ్లు.. కదలరు..మెదలరు!

 ఇల్లంతకుంట, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. కరెంటు సరఫరాలో లోపాలు తలెత్తినప్పు డు సిబ్బంది పట్టించుకోకపోవడంతో రైతులే ప్రాణాలకు తెగించి సరిచేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిర్వహణ లోపాలతో పాటు వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

 ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేస్తూ ఆ తర్వాత వాటి గురించి మరిచిపోతున్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నట్లు చెప్పి తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు. కానీ.. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
 
 ట్రాన్స్‌‘ఫార్మర్ల’వైపు చూస్తే ఒట్టు..
 ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరడంతో పాటు వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి లభ్యత దృష్ట్యా రైతులు రబీలో అంచనాలకు మించి వరిపంట సాగు చేశారు. అయితే కరెంటు సరఫరా రోజురోజుకు అధ్వానంగా మారడంతో రైతుల ఆశలు ఆరంభంలో అడుగంటుతున్నాయి. కరెంటు వచ్చే సమయాల్లో ట్రాన్స్‌ఫార్మర్లలో మరమ్మతుల వల్ల మోటార్లు నడవడం లేదు.

 రైతులు పొలాలను పారించుకోవడానికి మరమ్మతు చేసుకోబోయి ప్రమాదాలబారినపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది తరచూ ఆయా గ్రామాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను సందర్శించి పరికరాలను మార్చడం, రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రమాదాలపై అవగాహన కల్పించడం మరిచిపోయారు.
 
 వ్యవసాయ బావులకు సర్వీస్ చార్జీలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్న అధికారులు.. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద లోపాలను పసిగట్టి సరిచేకపోవడం శోచనీయమని రైతులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ గ్రామాల్లో రైతులు ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతులు చేసుకుంటున్నారు. ఆన్ ఆఫ్ స్విచ్‌లతో పాటు ఎర్తింగ్ సక్రమంగా లేక ఫ్యూజులు వేసే విషయంలో అవగాహన కరువై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా