స్వచ్ఛంద మిషన్

28 Apr, 2016 02:58 IST|Sakshi
స్వచ్ఛంద మిషన్

ప్రజల భాగస్వామ్యంతో చెరువు పునరుద్ధరణ
మిషన్ కాకతీయకు దీటుగా పనులు
తక్కువ ఖర్చుతో పూడికతీసిన గ్రామస్తులు
 

దుగ్గొండి : దుగ్గొండి మండలం పొనకల్ గ్రామంలోని కొత్త చెరువు 120 ఎకరాల ఆయకట్టు కలిగి, 50 ఎకరాల శిఖంతో ఉంది. ఇందులో పూడికమట్టి తీయక దశాబ్ధాలు గడుస్తోంది. ఈ చెరువు అభివృద్ధికి బాల వికాస స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. స్థానిక రైతులందరినీ సమవేశ పరిచి కమిటీని ఏర్పాటు చేసింది. చెరువు పూడికతీతకు పొక్లెయినర్‌ను సంస్థ ఉచితంగా సమకూర్చగా.. రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని పంట పొలాలకు మట్టి తరలించుకున్నారు. టిప్పుకు రూ.10 తాము వేసుకున్న కమిటీకి చెల్లిస్తున్నారు. ఈ డబ్బు రూ.లక్షకు చేరుకుంది. ఈ నిధులతో చెరువు కట్ట అభివృద్ధి పనులు చేయనున్నారు.


30వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు
చెరువులోని పూడిక మట్టిని ట్రాక్టర్‌లో నింపడానికి బాలవికాస సంస్థ పొక్లెయినర్‌కు ట్రిప్పుకు రూ.40 చెల్లిస్తోంది. అదే ప్రభుత్వం మిషన్ కాకతీయలో ట్రిప్పునకు రూ.120 చెల్లిస్తోంది. ఇప్పటికీ నెల రోజులుగా 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని 10వేల ట్రిప్పుల్లో రైతులు పంట పొలాలకు తరలించారు. దీనికి కాంట్రాక్టర్ ప్రకారం అయితే ప్రభుత్వం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కేవలం రూ.4 లక్షల ఖర్చుతో 20 ఎకరాల విస్తీర్ణంలో రెండు మీటర్ల లోతుతో పూడిక మట్టి తరలించారు. రైతుల కమిటీ నిర్ణయించిన ప్రకారం దగ్గరగా ఉంటే ట్రాక్టర్‌కు ట్రిప్పుకు రూ.55, దూరంగా ఉంటే రూ. 100 చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటికి 150 మంది రైతులకు చెందిన 500 ఎకరాల్లో పంట పొలాలకు సారవంతమైన మట్టి తరలించారు. ఈ చెరువుకు తూములు, మత్తడి నిర్మాణం ఏడాదిన్నర క్రితమే పూర్తి చేశారు. కట్టను పటిష్టపరిస్తే ఇక చెరువు పూర్తిస్థాయిలో అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వం రూ.30 లక్షలు వెచ్చించి చేసే పనిని రైతులు కేవలం రూ.5 లక్షలతో పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారు.
 
 
సమష్టిగా ముందుకు సాగుతున్నాం

బాలవికాస సంస్థ ఉచితంగా పొక్లెరుునర్ ఇస్తాం అని చెప్పిన వెంటనే అందరం కలిసి సమావేశం పెట్టుకున్నం. ముగ్గురు రైతులు, ఇద్దరు  ట్రాక్టర్ యాజమానులతో సర్పంచ్ గౌరవాధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలోని 60 శాతం రైతులకు ఇప్పటికి మట్టిని అందించాం. అభివృద్ధి కోసం నిధిని ఏర్పాటు చేసుకున్నాం. సమష్టిగా ముందుకు సాగుతున్నాం. సంస్థ కొంత సహకారం అందిస్తే కట్టను సైతం పటిష్టంగా నిర్మిస్తాం. - మోర్తాల రవి, రైతు కమిటీ సభ్యుడు, పొనకల్
 

మరిన్ని వార్తలు