అభివృద్ధిలో అగ్రగామి: రాజీవ్‌శర్మ

30 Nov, 2016 00:38 IST|Sakshi
అభివృద్ధిలో అగ్రగామి: రాజీవ్‌శర్మ

- సీఎం మార్గదర్శనంతో రాష్ట్రం దూసుకుపోతోంది
- విద్య, వైద్య, సాగు రంగాలపై దృష్టి సారిస్తే మనమే నంబర్ వన్
కేంద్రం సహకారం బాగానే ఉంది..
- విభజన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి
- నేడు పదవీ విరమణ చేయనున్న సీఎస్
 
 సాక్షి, హైదరాబాద్: సవాళ్లను అధిగమిస్తూ నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై పూర్తి స్థారుులో దృష్టి సారిస్తే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం బాగానే ఉందని.. ఏపీతో ఉన్న విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మ మీడియాతో తన మనోగతాన్ని పంచుకున్నారు. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదవిలో ఉన్న ఆయన.. ఆర్నెళ్ల పదవీ కాల పొడిగింపుతో ఇప్పటిదాకా సీఎస్‌గా కొనసాగారు. ఈ నేపథ్యంలో విభజన అంశాలు మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి వరకు పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు.

 అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా..
 కేంద్ర హోంశాఖలో నోడల్ అధికారిగా.. శ్రీకృష్ణ కమిటీకి, విభజన బిల్లు తయారీ సమయంలో మంత్రుల బృందానికి తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను వివరించానని సీఎస్ చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి అంశంపై విసృ్తత చర్చ జరిగిందని, హెచ్‌ఎండీఏ పరిధిని ఖరారు చేస్తే 42 శాతం రాష్ట్రం రాజధాని అవుతుందని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తనకు అత్యంత సంతృప్తి ఇచ్చిన అంశమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్ సంక్షోభం, ఉద్యోగులు, అధికారుల విభజన, విభజన చట్టానికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకెళ్లామని వివరించారు. సమగ్ర కుటుంబ సర్వేను అతి పెద్ద సవాల్‌గా తీసుకొని విజయవంతం చేశామన్నారు.

 జిల్లాల ఏర్పాట్లు గొప్ప పాలనా సంస్కరణ
 రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు గొప్ప పరిపాలనా సంస్కరణ అని, ఇది అధికార వికేంద్రీకరణకు పూర్తి స్థారుులో దోహదపడుతుందని రాజీవ్ శర్మ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి ఆసరా ఫించన్ల మొత్తాన్ని పెంచామన్నారు. రైతు రుణమాఫీ వచ్చే ఏడాదితో పూర్తవుతుందని తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో 13వ స్థానం నుంచి రాష్ట్రం మొదటి స్థానానికి రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సాగునీరు, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారిస్తే నాలుగైదేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

 భవిష్యత్‌లో మరింత ముందుకు..
 భవిష్యత్‌లో రాష్ట్రం మరింతగా ముందుకెళ్తుందని సీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. సుపరిపాలన, మౌలిక వసతులు, పారదర్శక పాలన వల్ల అత్యుత్తమ రాష్ట్రంగా నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉందని, అందుకే నగదు రహిత లావాదేవీల కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు