‘విశ్వ’మంత సేవకు...

21 Oct, 2014 00:15 IST|Sakshi
‘విశ్వ’మంత సేవకు...
  • ప్రణాళికలు సిద్ధం చేసిన గ్రేటర్ ఆర్టీసీ
  •  11 బస్ టెర్మినళ్లు, 55 డిపోలకు ప్రతిపాదనలు
  • సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా గ్రేటర్ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అదే స్థాయిలో సేవలను అందించేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో నగర అవసరాలకు అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే విధంగా, బలమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఇప్పుడున్న స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా దృష్టి సారిస్తోంది. నగరం చుట్టూ 11 భారీ టెర్మినల్స్, అదనంగా 55 బస్ డిపోలు ఏర్పాటు చేయనుంది.
     
    నగరంలో ప్రస్తుతం 34.02 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. 2019 నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఘట్కేసర్ , పెద్ద అంబర్‌పేట్, శామీర్‌పేట్, గండిమైసమ్మ, శంకర్‌పల్లి, మొయినాబాద్, తదితర ప్రాంతా ల్లో, ఔటర్ రింగురోడ్డు చుట్టూ వందలాది కాలనీలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది.

    ఇందుకనుగుణంగా  సిటీ సర్వీసులను  పెంచేందుకు  ఆర్టీసీ  ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం  గ్రేటర్‌లో 28  డిపోలు ఉన్నాయి. మొత్తం 1239 రూట్లలో 3,798 బస్సులు  ప్రజలకు  రవాణా సదుపాయాన్ని  అందజేస్తున్నాయి.  ఇప్పుడు ఉన్న డిపోల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో 83కు పెంచాలని, 8 వేలకు పైగా బస్సులను  అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ  భావిస్తోంది. రానున్న ఐదేళ్లలో  ప్రయాణికుల సంఖ్య  60 లక్షల నుంచి  70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు  అంచనా వేస్తోంది.
     
    ప్రవేశ మార్గాల్లో  11 భారీ టెర్మినల్స్..
     
    వాహనాల రద్దీ, రోజు రోజుకు పెరుగున్న నగర జనాభా, ఇరుకైపోతోన్న రహదారులు, దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి ప్రవేశించేందుకు ఇబ్బందుంలు ఎదువరుతున్నాయి. భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి నాలుగువైపులా ప్రధాన ముఖద్వారాల్లో 11  భారీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వీటి నుంచి ప్రయాణికులు నగరంలోకి  వచ్చి, వెళ్లేందుకు  లోకల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

    ఈ మేరకు బెంగళూరు మార్గంలో ఆరాంఘర్, వికారాబాద్ మార్గంలో  మొయినాబాద్, శంకర్‌పల్లి, ముంబయి నుంచి వచ్చే  బస్సులకు సుల్తాన్‌పూర్ వద్ద, మెదక్ మార్గంలో గండిమైసమ్మ వద్ద, నాగ్‌పూర్ మార్గంలో రాకపోకలు సాగించే బస్సులకు  గౌడవెల్లి వద్ద, కరీంనగర్  మార్గంలో శామీర్‌పేట్, వరంగల్ వైపు ఘట్కేసర్ వద్ద, విజయవాడ మార్గంలో పెద్ద అంబర్‌పేట్ , నాగార్జున్‌సాగర్ మార్గంలో ఇబ్రహీంపట్నం, శ్రీశైలం మార్గంలో తుక్కుగూడ వద్ద భారీ టెర్మినళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
     
    55 కొత్త డిపోలు అవసరం ...

    ప్రస్తుతం జంటనగరాల పరిధిలో  ఉన్న 28  డిపోలను  ఐదేళ్లలో  83 కు పెంచేవిధంగా ఆర్టీసీ ప్రతిపాదనలు చేస్తోంది. ఇందుకు స్థలాలు అవసరం.  ప్రస్తుతం ఉన్న డిపోల్లో  పార్కింగ్ సామర్ధ్యానికి  రెట్టింపు బస్సులు  ఉన్నాయి. వంద బస్సులకు మాత్రమే  పార్కింగ్ స్థలం అందుబాటులో ఉన్న డిపోల్లో 150 నుంచి  200 బస్సులను పార్క్ చేస్తున్నారు. ఐదేళ్లలో  బస్సుల  సంఖ్య 8 వేలు దాటే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా  డి పోల సంఘ్య పెంపు తప్పనిసరని భావిస్తోంది.  నగరం చుట్టూ ఉన్న రేడియల్ రోడ్లలో సైతం బస్సు డిపోలను ఏర్పాటు చేయాలనుకుంటోంది.

    కొత్తగా బాలాజీనగర్, భూదాన్‌పోచంపల్లి, బోరబండ, ఏదులనాగులపల్లి, కోహెడ, కెపీహెచ్‌బీ ఫోర్త్ ఫేస్, మంకాల్, మొయినాబాద్, ముత్తంగి, పోచారం, కుత్భుల్లాపూర్, ఉప్పర్‌పల్లి, కామారెడ్డిగూడ, కొండాపూర్, గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ హబ్, గచ్చిబౌలి క్యూ సిటీ, సర్దార్‌నగర్, నాదర్‌గూల్, శంషాబాద్, చేవె ళ్ల, కాటేదాన్ మధుబన్ కాలనీలలో కొత్త డిపోలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  ప్రభుత్వం స్థలాలను  కేటాయిస్తే రేడియల్ రోడ్ల చుట్టూ మరో  33 డిపోలు ఏర్పాటు చేసి, రవా ణా సదుపాయాలు పెంచాలని ఆర్టీసీ  భావిస్తోంది.
     

మరిన్ని వార్తలు