పత్రికల ధోరణిలో మార్పు రావాలి

22 Mar, 2015 02:05 IST|Sakshi
పత్రికల ధోరణిలో మార్పు రావాలి
  • ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఆవిష్కరణలో సీఎం కేసీఆర్
  • సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడి
  • ఈ పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచన
  • సాక్షి,హైదరాబాద్: పత్రికలు సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఈ తీరులో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతులేని దుఃఖంలో ఉన్న ప్రజల గాథలు కొన్ని పైపైనే కనిపిస్తాయని, మరి కొన్నింటి కోసం లోతుగా అన్వేషించాల్సి ఉంటుందన్నారు.హైదరాబాద్‌లో లక్షా 50 వేలకు పైగా ప్రజలు ఫుట్‌పాత్‌లపైనే నిద్రపోతున్నారని ఓ సంస్థ సర్వేలో తేలిందని, ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక తనను ఎంతో బాధకు గురిచేసిందని అన్నారు.

    మనసును కదిలించే ఇలాంటి వార్తలు పత్రికల్లో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది విజ్ఞులతో నిండిన పత్రికా రంగం ఈ అంశంపై సమీక్షించుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రెస్ అకాడమీ చెర్మైన్ అల్లం నారాయణతో కలిసి ‘నవ తెలంగాణ’ దినపత్రిక, వెబ్‌పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ... నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం, పాత్రికేయులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమాజంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ.. అన్నార్తులకు అండగా ఉంటూ.. చక్కటి విశ్లేషణలు, వార్తలతో పత్రిక ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తన  అస్తిత్వాన్ని పదిలపరుచుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ పేరుతో కొత్త పత్రిక రావడం శుభ పరిణామమన్నారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రజాశక్తి’ పేరుతో వచ్చిన పత్రిక .. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ‘నవ తెలంగాణ’గా రూపాంతరం చెందడం అభిలషణీయమన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నించాలని పత్రిక యజమానులకు సూచించారు. పత్రికా రంగం నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, ఈ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ‘నవ తెలంగాణ’ సంపాదకులు ఎస్.వీరయ్య అంతకు ముందు తన ప్రసంగంలో పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. కొత్తగా ఏర్పడిన పత్రికకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

    నవ తెలంగాణకు ప్రకటనల జారీ విషయంలో గతంలో ప్రజాశక్తి దినపత్రికకు అమలు చేసిన టారిఫ్‌ను కొనసాగిస్తామన్నారు. వచ్చే మంగళవారం నాటికి నవ తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పత్రికలు, విపక్షాలు కలిసి ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించాల్సిన అవసరముందన్నారు. ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ శేషు కుమార్ మాట్లాడుతూ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా పత్రికారంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, అమెరికా లాంటి దేశాల్లో సైతం చాలా పత్రికలు మూసివేత దిశగా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
     
    రెండే లైన్లు రాశారు: కేసీఆర్


    ‘నవ తెలంగాణ’ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ పత్రికలతో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాలను వెల్లడించారు. గతంలో తాను అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై ఏకంగా 67 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని, నాటి స్పీకర్ తనను చాంబర్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు పత్రికల్లో తన ప్రసంగానికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా వెతకగా... కేవలం రెండు వాక్యాలకు మించి వార్త కనిపించలేదన్నారు. అయితే, అదే ఒకసారి అసెంబ్లీలో నిరసనగా ఓ కాగితాన్ని స్పీకర్ వైపు విసిరితే మాత్రం ‘స్పీకర్‌పై దాడి’ అనే శీర్షికతో భారీ ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు.

మరిన్ని వార్తలు