‘పది’ మూల్యాంకనం షురూ

17 Apr, 2014 04:19 IST|Sakshi

ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ :  పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) ఎట్టకేలకు బుధవారం గందరగోళం మధ్య ప్రారంభమైంది. స్థానిక కాన్వెంట్ స్కూల్‌లోని స్పాట్ వాల్యూయేషన్ కేంద్రానికి ఉదయమే ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్దమొత్తం చేరుకున్నారు. వెంటనే ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఏకపక్ష నిర్ణయం సరికాదని అన్నారు. దీంతో మూల్యాంకన కేంద్రం వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలను మొహరించారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.

 ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన పది జవాబు పత్రాల మూల్యాంకనం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని కలెక్టర్ ఆయా పరీక్ష కేంద్రాల్లోని జిల్లా వ్యాప్తంగా 29 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తి వేసే వరకు మూల్యాంకనంలో పాల్గొనేది లేదని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ‘స్పాట్’ను బహిష్కరించారు. స్పందించిన కలెక్టర్ 17మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు డీఈవో రామారావు ప్రకటించారు. మిగితా 12మంది సస్పెన్షన్లను పరిశీలించి త్వరలోనే ఎత్తి వేస్తామని ఆయన పేర్కొన్నారు.

మూల్యాంకనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 28వరకు మూల్యాంకనం కొనసాగుతుందని, ఇందుకోసం 1,400 మంది ఏఈవోలు, సీఈలను నియమించామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు మద్ధతుగా టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు దారట్ల జీవన్, రవీంద్ర, దేవేందర్, వెంకటి, జాదవ్ కిరణ్‌కుమార్‌నాయక్, శామ్యూల్, పిల్లి కిషన్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు