రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్

1 Mar, 2016 03:09 IST|Sakshi
రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
 
మడికొండ :   రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మడికొండలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, అరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్, 33,34,53 డివిజన్‌ల ఇన్‌చార్జిలు ముత్తిరెడ్డి యాదవరెడ్డి, రాజారపు ప్రతాప్ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు సాగింది.  

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో రూ.300 కోట్లను ప్రకటించారన్నారు. వరంగల్‌ను విద్యకేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు.  గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని కేసీఆర్ 20 నెలల్లోనే చేసి నిరూపించారని పేర్కొన్నారు.  త్వరలోనే గ్రేటర్ వరంగల్‌లో తాగునీరు, రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఔటర్‌రింగ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 33,34,53 డివిజన్‌ల అభ్యర్థులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, జోరిక రమేశ్, ఆవాల రాధికరెడ్డి, ఊకంటివనంరెడ్డి, మేరుగు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

 సీఎం కేసీఆర్ మరో కానుక ఇవ్వాలి
 కాజీపేట / కాజీపేట రూరల్ : వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిపించినట్లుగానే టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులను గె లిపించి సీఎం కేసీఆర్‌కు మరో కానుక  అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఆవాల రాధికారెడ్డి, నార్లగరి రాజమణి, అబూబక్కర్, సంకు రేణుక  గెలుపు కోసం సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మడికొండ. బాపూజీనగర్, డీజిల్‌కాలనీల్లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్‌తో పాటు రాజారపు ప్రతాప్‌తో కలిసి డిప్యూటీ సీఎం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి తెలంగాణలో ఉనికి లేకుండా పోయినా డిపాజిట్లు గల్లంతు చేసుకునేందుకే పోటీకి దిగాయని ఎద్దేవా చేశారు.  టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రప్రభుత్వం నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ సందర్భంగా భాపూజీనగర్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయూన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు