కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ముట్టడి

18 Aug, 2014 01:49 IST|Sakshi

దోమకొండ :  విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు ఆదివారం నిరసనకు దిగారు. జనగామ, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన రైతులు జనగామ శివారులోని సీతారాంపల్లి వద్దనున్న సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

 ట్రాన్స్‌కో ఏఈ వచ్చి హామీ ఇచ్చేంత వరకు కదిలేదన్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో సబ్‌స్టేషన్ సిబ్బంది ఏఈ లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి రైతులను సముదాంచారు. కానీ రైతులు శాంతించలేదు. ఏఈ లక్ష్మణ్‌తో పాటు లైన్ ఇన్‌స్పెక్టర్ రాజు, లైన్‌మన్ నర్సింలు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ నాంపల్లి తదితరులను గదిలో నిర్బంధించారు. విద్యుత్ సరఫరాపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీబీపేట ఎస్సై నరేందర్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు.

రాస్తారోకో చేయడం, అధికారులను నిర్భందించడం సరికాదన్నారు. సరిగ్గా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండుతున్నాయంటూ రైతులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఏడు గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి నాలుగు గంటలు కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. అధికారులు ట్రాన్స్‌కో ఏస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడగా.. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఆందోళనలో రైతులు పాత రాజు, రవీందర్, శివరాములు, జీవన్‌రెడ్డి, కిష్టారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, దుర్గారెడ్డి, మల్లయ్య, శ్రీని వాస్, నాంపల్లి, రాజలింగం, దుర్గయ్యలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు