ఆ వైద్యుల విభజనపై పీటముడి

14 Feb, 2017 01:56 IST|Sakshi
ఆ వైద్యుల విభజనపై పీటముడి

వైద్య విద్య సంచాలక విభాగంలో డాక్టర్ల కేటాయింపుపై ప్రతిష్టంభన
ఏపీ స్థానికతగల వైద్యుల కేటాయింపుపై తెలంగాణ అభ్యంతరం
తెలంగాణ ఆప్షన్‌ ఇచ్చుకున్న వారిని వెనక్కి తీసుకునేందుకు ఏపీ ససేమిరా
ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన కమలనాథన్‌ కమిటీ సమావేశం


హైదరాబాద్‌: వైద్య విద్యా సంచాలక విభాగంలోని 171 మంది వైద్యుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. సోమవారం సచివాలయంలో కమల్‌నాథన్‌ నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగి సింది. స్థానికత ప్రకారం ఏపీకి చెందిన 171 మంది వైద్యులు తమకిచ్చిన ఆప్షన్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత రం వ్యక్తం చేసింది. ఏపీలో వైద్య పోస్టులు ఖాళీగా ఉండగా వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని వాదించింది. అయితే ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే విభజన చేపట్టినందున వారిని వెనక్కి తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కమిటీ నిర్ణయించింది. మరోవైపు నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించి ఏపీ నుంచి ఎంత మంది తెలంగాణకు వస్తే.. అంత మంది ఏపీకి వెళ్లేందుకు వీలుగా పరస్పర బదిలీలకు కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఇప్పటికే గవర్నర్‌ సమక్షంలో జరి గిన త్రిసభ్య కమిటీల చర్చల్లో ఈ విషయమై ఏకాభిప్రాయం వ్యక్త మైంది. కాగా, కోర్టుల్లో కేసులున్న కారణంగా ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీఎఫ్‌) అసిస్టెంట్‌ కమాం డెంట్లు, కార్మిక శాఖ అదనపు కమిషనర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించలేదు. ఈ భేటీలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ తరఫున ఐఏఎస్‌ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీ సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

మార్చితో ముగియనున్న కమిటీ గడువు...
కమల్‌నాథన్‌ కమిటీ గడువు మార్చి నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆలోగా వీలైనంత వరకు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఇరు రాష్ట్రాల అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నెలలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు