ఖమ్మంలోకమిషనరేట్

23 Jun, 2014 02:32 IST|Sakshi
ఖమ్మంలోకమిషనరేట్

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలీసు సంస్కరణల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. ఖమ్మం కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు త్వరలోనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఎస్పీ రంగనాథ్‌ను తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు.

ఇందుకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని సేకరించాలని, ఆరునెలల్లోనే ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో సమూల మార్పులు చేపట్టాలని ఆయన ఎస్పీకి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో హోంమంత్రి, డీజీపీలతో పాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో తొలిసారి సమీక్ష నిర్వహించి పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణల గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఎస్పీ రంగనాథ్ కూడా హాజరయిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన విషయాలపై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
 
 ఆ విశేషాలివి...
సాక్షి: ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో జిల్లాకు సంబంధించిన విషయాలపై ఎలాంటి చర్చ జరిగింది ?
ఎస్పీ: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణల గురించి సమావేశంలో చర్చ జరిగింది. అందులో భాగంగా జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన నివేదికను ఇచ్చాం. ముఖ్యమంత్రితో పాటు అందరూ జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరును అభినందించారు. జిల్లా పోలీసింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ముఖ్యంగా ఖమ్మం కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 
సాక్షి: కమిషనరేట్ ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుంది?

ఎస్పీ: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా వైరా వరకు కమిషనరేట్‌ను విస్తృత పర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను కూడా వెంటనే పంపాలని ఆదేశించారు. కమిషనరేట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు కూడా అనుమతి లభించింది. కలెక్టర్ సహకారంతో స్థలాన్ని ఎంపిక చేస్తాం. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. కమిషనరేట్ ఏర్పాటు ద్వారా ఖమ్మం నగరంతో పాటు వైరా వరకు శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమవుతుంది. అర్బన్ పోలీసింగ్‌లో మార్పులు రానున్నాయి. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో నగరం మరింత భద్రంగా ఉండబోతోంది. మనతో పాటు వరంగల్, మంచిర్యాల, కోల్‌బెల్ట్ ఏరియాల్లో కూడా కమిషనరేట్‌లు ఏర్పాటు చేయబోతున్నారు.
 
సాక్షి: జిల్లాలో ఒకే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. మరిన్ని స్టేషన్ల ఏర్పాటుకు అవకాశముందా?
ఎస్పీ: ఈ విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా స్టేషన్ ఉందని, కనీసం డివిజన్‌కు ఒకటయినా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా వస్తాయి.
 
 సాక్షి: సీసీఎస్ గురించి ఏమైనా మాట్లాడారా?
 ఎస్పీ: జిల్లాలో ప్రస్తుతం మూడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లు (సీసీఎస్)మంజూరయ్యాయి. సీసీఎస్‌లకు సంబంధించిన సిబ్బందిని కూడా కేటాయించారు. అందులో ఖమ్మంలో మాత్రమే సొంత భవనం ఉందని, కొత్తగూడెం, భద్రాచలంలలో లేవని, అందుకే అక్కడ కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నామని సమావేశం దృష్టికి తెచ్చాం. అక్కడ కూడా సొంత భవనాల నిర్మాణానికి నిధులిస్తామని చెప్పారు. అలాగే ఇప్పటికే జిల్లాకు అవసరమైన పోలీసు వాహనాలకు కూడా అనుమతి లభించింది. మొత్తం 50 వరకు కొత్త వాహనాలు జిల్లాకు త్వరలోనే రానున్నాయి. ఇక  గతంలో సీఐడీ పర్యవేక్షణలో ఉన్న సైబర్ క్రైమ్ సెల్‌ను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ సెల్‌ద్వారా సైబర్ నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తాం.
 
 సాక్షి: ఏజెన్సీలో పోలీసింగ్ ఎలా ఉండబోతోంది? మావోయిస్టులను ఎలా ఎదుర్కోబోతున్నారు?
 ఎస్పీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితుల్లో అందరి దృష్టీ ఏజెన్సీ పోలీసింగ్‌పైనే ఉంది. అయితే, సమావేశంలో మాకిచ్చిన ఆదేశాల ప్రకారం పాత పద్ధతిలోనే మావోయిస్టులను ఎదుర్కోబోతున్నాం. గతంలో నిర్వహించిన పోలీసింగ్, ఇతర రాష్ట్రాలు, ప్రత్యేక దళాల సహకారంతో కూంబింగ్ కొనసాగుతుంది. మావోల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదు.
 
సాక్షి: ఎన్నికల ముందు కొందరు పోలీస్ సిబ్బందిని బదిలీ చేశారు కదా? వారు మళ్లీ జిల్లాకు ఎప్పుడు రాబోతున్నారు?
 ఎస్పీ: ఎన్నికల ముందు బదిలీ చేసిన వారు ఇప్పుడప్పుడే జిల్లాకు వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. పోలీసు సిబ్బందికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం కచ్చితంగా రెండేళ్ల పాటు ఒక దగ్గర పనిచేస్తేనే బదిలీ ఉంటుంది. లేదంటే సదరు సిబ్బంది వ్యక్తిగత పనితీరు సంతృప్తికరంగా లేకపోతేనే బదిలీ చేయాలి. ఈ కారణంతో ఎన్నికలకు ముందు జిల్లా నుంచి బదిలీ అయిన వారిని అప్పుడే జిల్లాకు మార్చలేం. ఎస్‌ఐ స్థాయి నుంచి ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

>
మరిన్ని వార్తలు