విద్యాసంస్థల బంద్ విజయవంతం

1 Jul, 2014 02:18 IST|Sakshi
విద్యాసంస్థల బంద్ విజయవంతం

భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సోమవారం ముంపు మండలాల్లో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్లకు పైకి వచ్చి కేంద్రప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, అనంతరం మానవహారం నిర్వహించారు. ఎటపాక పాలిటెక్నిక్ విద్యార్థులు భద్రాచలం-చర్ల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
 
 ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీపీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.వెంకటపతిరాజు అక్కడికి వెళ్లి విద్యార్థులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. వీఆర్‌పురం, కూనవరం మండల కేంద్రాల్లోనూ  విద్యార్థులు రాస్తారోకో చేశారు. కుక్కునూరులో విద్యార్థులు రా స్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ముం పు మండలాల బదలాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రతులను దగ్ధం చేశారు.
 
ఆర్డినెన్స్ రద్దుకు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం...
పోలవరం ముంపు మండలాల బదలాయింపుపై కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేసేలా ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపడతామని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రకటించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఈ దీక్షలను తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు ప్రారంభించారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే రాజయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభిప్రాయాలను తెలుసుకోకుండా దొడ్డిదారిన తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. గిరిజనుల గోడు పట్టించుకోని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని హెచ్చరించారు. ఈనెల 14న ఢిల్లీ వెళ్లి ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతామని తెలిపారు.
 
 ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి...
ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లటం సరైంది కాదన్నారు. ముంపు ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ ప్రాంత గిరిజనులు అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పోలవరం ఆర్డినెన్స్‌పై పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. కాగా, సోమవారం నాటి దీక్షల్లో టీపీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు షేక్ గౌసుద్దీన్, ఎస్‌వీ సుబ్బారావు, వలరాజు సునందరావు,  శ్రీరాం, వెంకటేశ్వర్లు, షేక్ ఇమ్రాన్, సాయిబాబు, శ్రీనివాస్, మల్సూర్, జానకీరాం, నాగబాబు, సతీష్‌బాబు, విజయరాజు, హరినాధ్, సత్యనారాయణ, శ్రీనివాస్ కూర్చున్నారు.
 
దీక్షలకు పలువురి సంఘీభావం..
టీజేఏసీ దీక్షలను భద్రాచలం ఎంపీడీవో మాచర్ల రమాదేవి, పీఆర్ డీఈలు వెంకటరెడ్డి, రాంబాబు, పిలకా మోహన్‌రెడ్డి,  ఎంపీడీవో బెక్కంటి శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు బడ్జెట్ శ్రీనివాస్, తిలక్, బి.వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి అజయ్‌కుమార్, రామాచారి, జపాన్‌రావు, దాసరి శేఖర్, మడివి నెహ్రూ, చల్లగుళ్ల నాగేశ్వరరావు, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి, ఎంబీ నర్సారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.
 
నేటి నుంచి మహాపాదయాత్ర...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలనే డిమాండ్‌తో పీపుల్స్ ఎగెనైస్ట్ పోలవరం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకూ మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు కమిటీ నాయకులు సున్నం వెంకటరమణ ప్రకటించారు. సోమవారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. పొడియా(ఒడిశా) నుంచి భద్రాచలం వరకు 15 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో వివిధ ఆదివాసీ, హక్కుల సంఘాల వారు పాల్గొంటారని తెలిపారు. 

మరిన్ని వార్తలు