‘తాడిచర్ల’ రద్దు

26 Sep, 2014 03:57 IST|Sakshi
‘తాడిచర్ల’ రద్దు

- జెన్‌కోకు అచ్చిరాని బొగ్గు సేకరణ     
- సుప్రీంకోర్టు తీర్పుతో గనులపై నీలినీడలు
- చెల్పూర్ పవర్ ప్లాంట్‌కూ ఆటంకాలు     
- తొమ్మిదేళ్లలో రూ.120 కోట్లకు పైగా వ్యయం
మంథని :
మంథని మండలం తాడిచర్లలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించిన ఎంఈసీఎల్ (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ 1989లో రెండేళ్లపాటు అన్వేషణ చేసింది. ఆ సమయంలో అప్పటి పీపూల్స్‌వార్ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. వారి హెచ్చరికలతో ఆ సంస్థ బొగ్గు నిక్షేపాల అన్వేషణను నిలిపివేసింది. అనంతరం రంగంలోకి దిగిన సింగరేణి సంస్థ.. 1999లో ఆగిపోయిన పనులు మొదలుపెట్టింది. ఏడాది తర్వాత 2000 సంవత్సరంలో సింగరేణికి సంబంధించిన యంత్రాలను నక్సల్స్ తగులబెట్టారు.

దీంతో తాడిచెర్ల-1, 2 బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని సింగరేణి అధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 2013లో 17 రోజులపాటు సమ్మె చేపట్టాయి. దీంతో సింగరేణి సంస్థ, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. తిరిగి జెన్‌కో సంస్థ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిర్మిస్తున్న కేటీపీపీ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గును తాడిచర్ల బ్లాక్-1 నుంచి ఉత్పత్తి చేసుకుంటామని ప్రభుత్వానికి నివేదించింది. దీనికి సర్కారు ఆమోదించడంతో 2005లో సింగరేణి సంస్థ జెన్‌కోకు తాడిచర్ల బొగ్గుబ్లాకును అప్పగించింది. మొదటిసారిగా చేపట్టిన ఉపరితల బొగ్గు గనుల ఏర్పాటు తమకు మంచి ఫలితాలను తీసుకొస్తాయని జెన్‌కో భావించినా.. లాభాల మాట అటుంచితే తలనొప్పి తెచ్చిపెట్టింది.
 
నిర్వాసితులకు పరిహారం చెల్లింపు
తాడిచర్ల-1 ప్రాజెక్టుకు మొత్తం 2,186 ఎకరాలు అవసరమైంది. ఇందులో 752.33 ఎకరాలకు పట్టాదారులున్నట్లు గుర్తించి వారికి ఎకరాకు రూ.3.80 లక్షల చొప్పున రూ.32.07 కోట్లను పరిహారంగా అందించింది. మిగిలిన 1434 ఎకరాల అసైన్డ్ భూమికి చెల్లింపు కోసం రూ.33కోట్లు డిపాజిట్ చేసింది. ఈ సొమ్మును మరో పదిహేను రోజుల్లో నిర్వాసితులకు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
 
సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన
ఇన్ని చేశాక.. ఆ బ్లాక్ నుంచి బొగ్గు కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015 మార్చి నాటికి చెల్పూర్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. ఆ లోపు తాడిచర్ల బ్లాక్‌లో బొగ్గు సేకరణ చేయాలనే నిబంధన ఉంది. కానీ కేటాయింపుల్లో అక్రమాలు, పనుల ఆలస్యం కారణంగా బొగ్గు బ్లాక్ రద్దు కావడంతో గనుల ఏర్పాటుకు గ్రహణం పట్టుకున్నట్లయ్యింది. బొగ్గు గనులు ఏర్పాటైతే తాడిచర్లలో పారిశ్రామిక ప్రగతి సాద్యమవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
 
తాడిచర్ల ప్రాజెక్టు ప్రొఫైల్
1989లో ఏంఈసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ
అప్పటిపీపుల్స్‌వార్ హెచ్చరికలతో అన్వేషణ నిలిపివేత
1999లో రంగంలోకి దిగిన సింగరేణి
2000 సంవత్సరంలో యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు
1, 2 బ్లాక్‌లను ప్రైవేటు అప్పగిస్తూ సింగరేణి నిర్ణయం
2013లో 17 రోజులు సమ్మె చేసిన కార్మిక సంఘాలు
భూపాలపల్లిలోని కేటీపీపీ రెండోదశ విద్యుత్ కేంద్రానికి ఇక్కడి నుంచే బొగ్గు రవాణాకు జెన్‌కో సంసిద్ధత
2005లో జెన్‌కో చేతికి తాడిచర్ల బొగ్గు బ్లాక్
నిర్వాసితులకు 32.07 కోట్లు చెల్లించిన జెన్‌కో
1434 అసైన్డ్ భూములకూ రూ.33 కోట్లు డిపాజిట్
సుప్రీంకోర్టు నిర్ణయంతో తాజాగా రద్దయిన బ్లాక్‌లు

మరిన్ని వార్తలు