భువిపై దివ్య మందిరం

27 May, 2014 00:19 IST|Sakshi
  • రూ.వంద కోట్లతో లక్ష్మీనరసింహాలయం
  •  శరవేగంగా నిర్మాణ పనులు
  • సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరంలో ఆధ్యాత్మిక దివ్య మందిరం రూపుదిద్దుకోనుంది. ఇందులో భక్తకోటి ఇష్టదైవం శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలిచిన వారి కొంగు బంగారం కానున్నాడు. రూ.వంద కోట్లతో హరేకృష్ణ మూవ్‌మెంట్ భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని 4.38 ఎకరాల సువిశాల క్షేత్రంలో లక్ష్మీనరసింహుడు కొలువుదీరనున్నాడు. ప్రపంచదేశాల్లో ఇప్పటికే అతిపెద్ద పర్యాటక నగరంగా ప్రాచుర్యం పొందిన భాగ్యనగరం మునుముందు కోట్లాది మంది భక్తులు సందర్శించే యాత్రాస్థలంగానూ విలసిల్లనుందని మూవ్‌మెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

    హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట గురించి చెప్పుకొన్నట్లే స్వ యంభుగా వెలసిన లక్ష్మీనరసింహుడి క్షేత్రంగా  కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని వారంటున్నారు. మొత్తం మూడు దశల ఈ ఆలయ పనుల్లో తొలి దశ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లల్లో పూర్తి చేస్తారు.  2, 3 దశ ల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం, కల్చరల్ కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. మొత్తం ఆరేళ్లలో ఈ అద్భుత ఆలయానికి రూపునివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాన స్వామీజీ  ‘సాక్షి’తో చెప్పారు.
     
    ఇదీ చరిత్ర...

    మహావిష్ణువు అవతారమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి బంజారాహిల్స్‌లో స్వయంభుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. యాదగిరిగుట్టకు  వెళ్లడానికి ముందు కొద్ది క్షణాలసేపు ఆయన లక్ష్మీదేవితో కలిసి బంజారాహిల్స్ అడవుల్లోని కొండలపై నిల్చున్నారని, అక్కడ పాదముద్రలు వెలిశాయని భక్తుల విశ్వాసం.

    సుమారు 700 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో పూజలు జరిగాయి. స్వామీజీలు ఇక్కడకు వచ్చి భక్తులకు ఆధ్మాత్మిక సందేశాలను ఇచ్చేవారు. అలా యాదగిరిగుట్ట కంటే ముందే నగరంలో కొలువుదీరిన దేవుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని హరేకృష్ణ మూవ్‌మెంట్ సంకల్పించింది. ఈ మేరకు ఈ నెల 2న భూమి పూజ జరిగింది. ప్రస్తుతం రెండు స్తంభాల నిర్మాణం పూర్తయింది.
     
    విశేషాలివీ..
    అద్భుత నిర్మాణశైలితో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్యమైన దేవాలయం గ్రౌండ్‌ఫ్లోర్‌లో లక్ష్మీదేవి సమేత నరసింహుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు
         
     అష్టకోణాకృతిలో మండపాన్ని, గర్భగుడిని ఏర్పాటు చేస్తారు
         
     కింది అంతస్తులోనే భక్తులకు జ్ఞానంతో పాటు ఆహ్లాదాన్ని కలిగించేలా నరసింహుని జీవిత సంగ్రహ చరిత్ర, లీలలు తెలిపే లైట్స్ అండ్ సౌండ్స్ ప్రదర్శన ఉంటుంది
         
     మొదటి అంతస్తులో 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల హాల్ నిర్మిస్తారు. ఇందులోనే సుమారు 8 అడుగుల నరసింహుడి మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు
         
     తమిళనాడులోని  కుంభకోణంలో విగ్రహానికి రూపురేఖలనిస్తున్నారు
         
     హాల్‌లో భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు
         
     ఆలయం పైన  ఒక బంగారు విమానం కూడా ఏర్పాటు చేస్తారు
         
     ఉదయాన్నే భానుడి లేలేత కిరణాలు దేవదేవుని పాదాలను తాకేలా నిర్మాణ ఏర్పాట్లు ఉంటాయి
         
     భారీ మందిరం 24 స్తంభాలపై ఏర్పాటవుతుంది. స్తంభాలపై కనువిందు చేసే దశావతార ఘట్టాలను చిత్రిస్తారు
         
     ధ్వజస్తంభాన్ని పూర్తిగా బంగారు తాపడంతో తయారుచేయిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు