ఇక డీజీపీ పదవీకాలం రెండేళ్లు..

9 Sep, 2014 01:15 IST|Sakshi
ఇక డీజీపీ పదవీకాలం రెండేళ్లు..

తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
 
హైదరాబాద్: ఇకపై డీజీపీ  పదవీ కాలాన్ని రెండేళ్లు తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.  దీనికి సంబంధించిన  చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.  పోలీసుశాఖలో తీసుకు రావలసిన సంస్కరణలకు  సంబంధించి  ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు  2006లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది.  ఇందులో  ప్రధానంగా రాష్ట్ర డీజీపీని ఎంపిక చేయడానికి  ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర డీజీపీగా నియమించిన అధికారి  పదవీ కాలపరిమితి రెండేళ్లు తప్పని సరి చేయాలని, ఎస్‌ఐ నుంచి అదనపు డీజీస్థాయి అధికారులను  రెండేళ్లపాటు  వారి పోస్టు నుంచి తప్పించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజలు పోలీసులపై  ఫిర్యాదులు చేయడానికి ప్రతీ జిల్లాలో పోలీసు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటుచేసి, వాటిని ఉన్నతాధికారులు విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసుశాఖలో సైతం తమపై అధికారిపై  క్రిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు  చేయడానికి కంప్లైంట్ బాక్సును  ఏర్పాటు చేయాలని సూచించింది. 

వీటిని మూడునెలల్లోగా  అమలు చేస్తూ తమకు నివేదిక ఇవ్వాలని కోరింది.  ఇందులో కొన్నింటిని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.  కానీ డీజీపీ పోస్టు పదవీకాలం మార్పు, స్టేట్ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు విషయాల్ని అమలు చేయలేదు. రాష్ట్ర విభజన జరిగే చివరిదశలో..  రెండేళ్లు కాకముందే తనను  బదిలీ చేయడం అన్యాయమని  రైల్వే ఎస్పీ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  దీనిపై సుప్రీం  ఇచ్చిన నోటీసుమేరకు అప్పటి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే.మహంతి కోర్టుకు హాజరై ఈ అంశంతోపాటు  డీజీపీ పోస్టు టెన్యూర్‌ను రెండేళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు.  ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన జరగడంతో సుప్రీం  సూచనలు అమలు కాలేదు.  తాను చేసిన సిఫార్సులను పాటించలేదని  మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం  సీరియస్ కాకమునుపే తామూ పాటించాలని కూడా  భావిస్తున్నట్లు  తెలిసింది.
 
 

మరిన్ని వార్తలు