సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

18 Oct, 2014 01:50 IST|Sakshi

హన్మకొండ చౌరస్తా : ప్రజల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆయన మంత్రి వర్గం ఇప్పటికీ జనాకర్షణ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప.. సంక్షేమ పథకాల అమలు శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ పంటలకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తన భూములే పోయాయంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ విలువకు నాలుగు రెట్ల నగదును అందజేయాలని డిమాండ్ చే శారు. రాష్ట్ర విభజనలో భాగంగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రలో కలిసిందని, అక్కడి నుంచి మనకు రావాల్సిన విద్యుత్‌పై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సీఐడీ విచారణ పేరుతో సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, వాటిని మళ్లీ ప్రారంభించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజలను గతంలో ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలనడం సబబుకాదన్నారు.  భూదందా, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నవంబర్ 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి టీ శ్రీనివాసరావు, మడత కాళీదాసు, మేకల రవి, టి సత్యం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు