రూ.కోటికి పైగా ‘ఐపీ’

5 Jul, 2016 00:06 IST|Sakshi

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన మహిళ
ఒక్కొక్కరి నుంచి రూ.5-6 లక్షలు వసూలు
నోటీసులు అందుకొని లబోదిబోమంటున్న బాధితులు

 
 
లింగాలఘణపురం : మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన ఓ సాధారణ మహిళ రూ.కోటికి పైగా ఐపీ పెట్టి ఉడాయించిన సంఘటన జరిగింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసి, గత మూడేళ్లుగా నమ్మబలుకుతూ చివరి ఐపీ నోటీసులు పంపించింది. నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ మహిళ రైల్వేలో టికెట్ మాస్టర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కళ్లెం, సంగెం, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌కు చెందిన 22 మంది వద్ద మూడేళ్ల క్రితం డబ్బు వసూలు చేసింది. ఆ మహిళ సోదరుడు కాజీపేటలో ఉంటూ ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన వారు ఆ మహిళను ఉద్యోగాల కోసం అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొంత మందిని ఢిల్లీ, ముంబాయి, పుణె, కర్నాటక తదితర ప్రాంతాల్లో కొద్ది రోజుల క్రితం అక్కడక్కడ ఉంచినట్లు తెలిసింది. ఏదో విధంగా నమ్మిస్తూ మూడేళ్లుగా కాలయాపన చేస్తోంది.


కాగా, ఆ మహిళ సోదరుడు కాజీపేటలో ఉండడంతో బాధితులు అక్కడికి కూడా వెళ్లి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ తతంగం జరుగుతున్న తరుణంలో మూడు రోజుల క్రితం మహిళ గ్రామం నుంచి కనిపించకుండా పోయి డబ్బులు తీసుకున్న వారికి ఐపీ నోటీసులు పంపించింది. అవి చూసిన బాధితులు లబోదిబోమంటూ ఎక్కడా చెప్పుకోలేక నలిగిపోతున్నారు. కాగా, ఇటీవల లింగాలఘణపురం మండలం నెల్లుట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా ఐపీ పెట్టి వె ళ్లాడు. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని వ్యాపారంలో అప్పుల పాలయ్యాయమంటూ తప్పుడు లెక్కలతో నమ్మిన వారిని మోసగించడం పరిపాటిగా మారింది.
 

మరిన్ని వార్తలు