ఘోర రోడ్డు ప్రమాదం

30 Dec, 2014 02:09 IST|Sakshi
ఘోర రోడ్డు ప్రమాదం

ఇంద్రవెల్లి/ఆదిలాబాద్ రిమ్స్ : ఇంద్రవెల్లి మండలం ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది.

ఎస్సై హనోక్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల వైపు వెళ్తోంది. లక్సెట్టిపేట నుంచి ఐచర్ వాహనం బియ్యం లోడ్‌తో ఆదిలాబాద్ వైపు వెళ్తోంది. మండలంలోని ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ మధ్య ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.

దీంతో బస్సు డ్రైవర్ రాంచందర్‌తోపాటు ప్రయాణికులు ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత(కేస్లాపూర్ పాఠశాల), నస్రీమ్‌బేగం(నార్నూర్ ఉర్దూ మీడియం పాఠశాల), రజితారెడ్డి(ఇంద్రవెల్లి ఏహెచ్‌ఎస్), సరస్వతీ(పిట్టబొం గరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు), ఆదిలాబాద్‌కు చెందిన శైలజ తీవ్రం గా గాయపడ్డారు. వీరితోపాటు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

శంకర్‌గూడ, ఇన్కార్‌గూడ గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108, ప్రైవేటు వాహనాల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘట న స్థలంలో క్షతగాత్రులను ఆది లాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న ఎంపీ గెడం నగేష్ పరామర్శించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమా దం జరిగిందని ఎస్సై హనోక్ తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

రిమ్స్‌లో చికిత్స
రోడ్డు ప్రమాద క్షతగాత్రులు సుమారు 20 మందిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రి నిండిపోయింది. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత, నస్రీన్‌బేగంతోపాటు డ్రైవర్ రాంచందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ పరామర్శించారు. ప్రమాద బాధితులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఎమర్జెన్సీ వార్డు ఎదుట టూటౌన్ సీఐ బుచ్చిరెడ్డి, ఎస్సై రాములు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు