నీళ్లు పారాలంటే నిధులు రావాలి! 

21 Feb, 2019 03:27 IST|Sakshi

సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం కింద రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రం 

కేంద్ర సాయం అందాల్సిన 11 ప్రాజెక్టులకు మొండిచెయ్యి 

564 కోట్ల మేర అందని నిధులు 

నేడు రాష్ట్రానికి కేంద్ర జలవనరులశాఖ ప్రత్యేక బృందం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం(ఏఐబీపీ)లో చేర్చిన రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొండిచేయి చూపింది. ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేస్తామని అనేకమార్లు ఊదరగొట్టిన కేంద్రం ఏడాదిగా వాటిపై మౌనం వీడలేదు. 11 ప్రాజెక్టులకు రూ.564 కోట్ల మేర సాయం అందిస్తామని చెప్పి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా సాగునీటి లక్ష్యాలను నీరుగారుస్తోంది. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖ గుర్తించింది.

ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇందులో ఇప్పటికే 19,928 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.7,791 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకై ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి ఏఐబీపీ కింద నిధులు సమకూర్చి ఆదుకోవాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ కేంద్ర సాయం కింద రూ.4,513.19 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించగా, ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు రూ.3,949.19 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది రూ.564.70 సాయం అందించాల్సి ఉంది. ఇందులో అధికంగా దేవాదులకు రూ.496 కోట్లు రావాల్సి ఉంది.  

నేడు రానున్న కేంద్ర బృందం.. 
ఏఐబీపీ నిధుల బకాయిలు, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కమిషనర్‌ ఒహ్రా నేతృత్వంలో బృందం గురువారం రాష్ట్రానికి రానుంది. 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించి ప్రాజెక్టుల పనులను పరిశీలించనుంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులు కేంద్ర జలవనరుల శాఖ బృందానికి విన్నవించనున్నారు.  

ఆయకట్టు లక్ష్యాలకు దెబ్బ.. 
భూసేకరణ సమస్యలు, సహాయ పునరావాసం కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెబుతోంది. అయినా నిధులు మాత్రం రావటం లేదు. ఈ ప్రభావం ప్రాజెక్టుల ఆయకట్టు లక్ష్యాలపై పడుతోంది.11 ప్రాజెక్టుల్లో 6.36 లక్షల హెక్టార్లలో ఆయకట్టుకు నీరందించాల్సి ఉండగా, ఇంతవరకు 88,021 హెక్టార్లకే సాగునీరందింది. మరో 3.22 లక్షల హెక్టార్లకు నీరందించేలా పనులు సిద్ధం చేసినా, నీళ్లు రాక ఆయకట్టు సాగుకాలేదు. అయినా ఇంకా 2.26 లక్షల హెక్టార్లకు సాగునీరందించేలా పనులు జరగాల్సి ఉంది.

ఇందులో దేవాదుల కిందే .248 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించాల్సి ఉన్నా 1.25 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తయ్యాయి. మిగతా ఆయకట్టుకు ఈ ఖరీఫ్‌లో నీరందించాల్సి ఉన్నా అది అనుమానంగా ఉంది. ఎస్సారెస్పీ–2లోనూ 1.78లోల హెక్టార్లకు సాగునీరందించాల్సి ఉండగా, 1.38 లక్షల హెక్టార్లకు నీరందించే పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు ఈ జూన్, జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నుంచి 18.10 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇక భీమా పరిధిలోనే అదే పరిస్థితి నెలకొంది. ఈ నిధులు సకాలంలో అందితేనే వాటి పూర్తిసాధ్యం కానుంది. లేనిపక్షంలో లక్ష్యాలు నీరు గారిపోవడం ఖాయంగా ఉంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు