‘కాళేశ్వరం’లో మరో ఎత్తిపోతలు 

7 Nov, 2017 01:31 IST|Sakshi

మలక్‌పేట్‌ రిజర్వాయర్‌ పరిధిలో నిర్మాణం 

కోనరావుపేట, వీర్నపల్లిల్లో 10 వేల ఎకరాల స్థిరీకరణ 

రూ.166 కోట్లతో చేపట్టేందుకు సర్కారు ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మలక్‌పేట రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించి కరీంనగర్‌ జిల్లాలోని కోనరావుపేట, వీర్నపల్లి మండలాల పరిధిలోని 10 వేల ఎకరాలకు నిరీచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మలక్‌పేట రిజర్వాయర్‌ ఎడమ కాల్వ పరిధిలో 4.26 కి.మీ. వద్ద నుంచి నీటిని మళ్లించి మూలవాగు, హనుమయ్య చెరువులు నింపడం.. అలాగే 6.5 కి.మీ. వద్ద నీటిని తరలించి సింగసముద్రం, రాయుని చెరువులు నింపి వాటికింది 10 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.166 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.  

36 ప్యాకేజీల గడువు పొడిగింపు 
ప్రాజెక్టుల పరిధిలో పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు ధరలు చెల్లిస్తూ ఇప్పటికే విడుదల చేసిన జీవో 146 పరిధిలోని 36 ప్యాకేజీల పనుల గడువును వచ్చే ఏడాది మే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 ప్రాజెక్టుల పరిధిలోని 111 ప్యాకేజీలకు ఎస్కలేషన్‌ చెల్లించాలని రెండేళ్ల కిందే నిర్ణయించగా, తర్వాత ప్యాకేజీల సంఖ్య 116కు పెరిగింది. వీటిలో వివిధ కారణాలతో 33 ప్యాకేజీలను తొలగించగా, 83 ప్యాకేజీలను ఎస్కలేషన్‌ పరిధిలోకి చేర్చారు. వీటిలో 74 ప్యాకేజీలకు ఎస్కలేషన్‌ చెల్లింపుల విషయమై ఇప్పటికే అధికారిక ఆమోదం లభించింది. ఇందులో 36 ప్యాకేజీలను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూ సేకరణలో ఇబ్బందులతో పనులు పూర్తవలేదు. దీంతో గడువును ప్రభుత్వం పొడిగించింది.  

మరిన్ని వార్తలు