విద్యుత్‌ లైన్లు మృత్యుపాశాలు!

5 Mar, 2019 15:10 IST|Sakshi
తిప్పపూర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌  

ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

ఆందోళన చెందుతున్న గ్రామస్తులు

పట్టించుకోని అధికారులు

సాక్షి, ఉప్పునుంతల: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. 11కేవీఏ లైన్లు ఇళ్లపై వేలాడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల సమయంలో  మరింత భయపడుతున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతిన స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వ్యవసాయ పొలాల్లో రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్‌ లైన్లను అమర్చి ప్రమాదపుటంచున వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏళ్ల తరబడిగా ప్రజలను వేధిస్తున్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లపై 11కేవీఏ లైన్లు..
మండలంలోని వెల్టూరులోని ఫకీర కాలనీలో 11కేవీఏ విద్యుత్‌ లైన్లు ఇళ్ల పై నుంచి ఉన్నాయి. దీంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దాసర్లపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. మూడేళ్ల క్రితం గాలి దుమారానికి విద్యుత్‌ లైన్‌ తీగలు తెగిపడి పశుగ్రాసం, గుడిసెలు కాలిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ లైన్‌ మారుస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప్పునుంత మడ్డవోనిపంపు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, తిర్మలాపూర్, తిప్పాపూర్, వెల్టూర్‌ తదితర గ్రామాల్లో విద్యుత్‌ లైన్లు ఇళ్లపై ఉన్నాయి. వీటితో పాటు కొన్నేళ్ల క్రితం ఆయా గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

 వ్యవసాయ పొలాల్లో..
వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ లైన్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గుట్టమీది తండా శివా రులో విద్యుత్‌ తీగలు పూర్తిగా కిందకు వేలాడుతున్నాయి. ఉప్పునుంతల నుంచి కొత్త రాంనగర్‌ వెళ్లే దారి పక్కన బల్సోని బావి వద్ద రైతులు కొన్నేళ్ల నుంచి రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్‌ తీగలు అమర్చుకొని మోటార్లు నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మార్పునకు ప్రొవిజన్‌ లేదు
కాలనీలు, ఇళ్లపై ఉన్న విద్యుత్‌ లైన్లు మార్చడానికి శాఖాపరంగా ప్రొవిజన్‌ లేదు. కాలనీ వాసులు, ఇళ్ల యజమానులు లైన్‌ మార్పిడికి అయ్యే ఖర్చు భరిస్తే మాత్రం అవకాశం ఉన్నచోట ప్రతిపాదనలు తయారుచేసి విద్యుత్‌ లైన్‌ మార్పిడి చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం వేసిన కరెంట్‌ లైన్లు వేలాడుతుంటే, స్తంభాలు ఒరిగిపోతే, బిల్లులు పెండింగ్‌ లేకుండా చెల్లిస్తే మార్చే అవకాశం ఉంది. వ్యవసాయ మోటారు కనెక్షన్‌కు డీడీలు కట్టిన రైతులకు మాత్రం ఇంతకుముందు మెటీరియర్‌ డ్రా చేయకుండా ఉంటే ప్రస్తుతం వాటిని పరిశీలించి వారికి వచ్చే మెటీరియల్‌ను ఇప్పిస్తున్నాం.
 – సురేష్, డిస్కం ఏఈ, ఉప్పునుంతల 

మరిన్ని వార్తలు