నిర్మాణ రంగ కార్మికులకు...ఆర్థిక భరోసా..!

23 Apr, 2020 02:04 IST|Sakshi

కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉన్న వారికిచ్చేలా కార్మిక శాఖ కార్యాచరణ 

ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 ఇచ్చేలా ప్రతిపాదనలు 

తాజాగా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన యంత్రాంగం 

రాష్ట్రవ్యాప్తంగా 15.42లక్షల మంది రిజిస్టర్డ్‌ లేబర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు కార్మిక శాఖ రూపొందించిన ఆర్థిక సాయం ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. రాష్ట్రంలో నెల రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఫలితంగా భవన, ఇతర నిర్మాణ రంగంలో పనులన్నీ నిలిచిపోయాయి. కొత్త ప్రాజెక్టుల సంగతి అటుంచితే ఇప్పటివరకు కొనసాగుతున్న పనులు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్‌–19 ప్రభావం దృష్ట్యా ఇది పొడిగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కఠినంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నిర్మాణ పనులకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి లేదు. ఫలితంగా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి.

ఈక్రమంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి(టీఎస్‌బీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) ద్వారా ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బోర్డు ద్వారా కార్మికులకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రమాదవశాత్తు గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం, అదేవిధంగా కార్మికుల పిల్లలకు చదువుకుంటున్న కోర్సుకు తగినట్లు ఉపకారవేతనాలు అందించడం వంటి కార్యక్రమాలను బోర్డు అమలు చేస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ సమయంలో కార్మికులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఊరట ఇవ్వాలని భావించిన బోర్డు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. 

రిజిస్టర్డ్‌ లేబర్‌ 15.45 లక్షల మంది.. 
రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ రంగంలో దాదాపు 54 రకాల విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. అయితే బోర్డులో వివరాలను నమోదు చేసుకుని పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు 15.45 లక్షల మంది. వీరిలో పురుషులు 9.22 లక్షలు, మహిళలు 6.23 లక్షల మంది ఉన్నారు. వీరు తమ వివరాలను బోర్డులో ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెన్యువల్‌ చేసుకున్న వారు 8.28 లక్షలు. అయితే బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ.1,000 లేదా రూ.1,500 వంతున ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.బోర్డు వద్ద ఉన్న నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే ఆర్థిక సాయం చేసే అంశానికి మార్గం సుగమమవుతోంది. 

కుటుంబానికా... ఒక్కొక్కరికా... 
బోర్డులో పేరు నమోదు చేసుకున్న వారు 15.45 లక్షలు మంది ఉన్నారు. వీరిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలావరకు భార్య, భర్త ఇరువురి పేర్లున్నాయి. వీరికి ఆర్థిక సాయం ఎలా చేయాలనే దానిపై అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సాయం అందిస్తే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవుతాయని భావించిన అధికారులు... కుటుంబంలో ఒకరికి సాయం చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా ఒక్కో సభ్యుడికి విడిగా సాయం అందిస్తే ఖర్చయ్యే మొత్తాన్ని కూడా మరో ప్రతిపాదనగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నారు.

మరిన్ని వార్తలు