ఎన్నికల బరిలో నిలిచేదెవరో..?

9 Mar, 2019 09:01 IST|Sakshi

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో మరో సారి రాజకీయ వేడి మొదలైంది. పార్టీ ఎన్నికల గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మండలంలో పోరు రసవత్తరంగా మారనుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైనవారు, అవకాశం లభించని ఆశావహులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు.

రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా రిజర్వేషన్‌ కేటగిరి నాయకులు ఇప్పటికే పెద్ద నాయకులను సంప్రదించి తమకే సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో సమరం నువ్వా నేనా? అనేవిధంగా సాగనుంది. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు అభ్యర్థులు పార్టీ టిక్కెట్‌ ఇవ్వకున్నా స్వతంత్రగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పొత్తులు పెట్టుకోవాలా.. వద్దా?
సర్పంచ్‌ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. అవే పొత్తులు కొనసాగించాలా..లేదా? పార్టీ గుర్తుల ఎన్నికలు కాబట్టి ఒంటరి పోరులో ఉందామా? అని ఆలోచన చేస్తున్నారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో సంస్థాన్‌ నారాయణపురం–1, జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, గుజ్జ ఎంపీటీసీ స్థానాల్లో ఇతర గ్రామపంచాయతీలు లేవు. మిగతా 8 ఎంపీటీసీ స్థానాలలో పలు గ్రామపంచాయతీలు కలిసి ఉన్నాయి.

అయితే ఎంపీటీసీగా పోటీ చేయనున్న అభ్యర్థులు పక్క గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లు, వచ్చిన ఓట్లు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ గుర్తు వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకొంటున్నారు. ఎన్నికలకు ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించాలని, దాంతో ఓటర్లకు దగ్గర అవుతారని కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారు. మరికొంత మంది నాయకులు మాత్రం ముందుగా ప్రకటిస్తే అభ్యర్థులకు ఖర్చు అధికమవుతుందని వాదిస్తున్నారు. బయటకు ప్రకటించకుండా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని, ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ప్రకటించాలని కొంతమంది నాయకులు కోరుతున్నారు.

రిజర్వేషన్లు ఇవే...
జెడ్పీటీసీ సభ్యులు–జనరల్‌ మహిళ, ఎంపీపీ– జనరల్‌ మహిళ 1, చిల్లాపురం – ఎస్టీ జనరల్, 2.గుడిమల్కాపురం– జనరల్‌ మహిళ, 3. గుజ్జ– జనరల్, 4. జనగాం– ఎస్సీ మహిళ, 5. పల్లగట్టుతండా–ఎస్టీ మహిళ, 6. కంకణాలగూడెం– జనరల్‌ మహిళ, 7.నారాయణపురం 1–జనరల్, 8. నారాయణపురం–2– జనరల్, 9. పుట్టపాక–జనరల్‌ మహిళ, 10. సర్వేల్‌–1– ఎస్సీ జనరల్, 11. సర్వేల్‌–2– జనరల్‌ మహిళ, 12. వాయిలపల్లి– బీసీ జనరల్, 13 పొర్లగడ్డతండా– ఎస్టీ జనరల్‌ గా రిజర్వేషన్‌ ఖరారు చేశారు. 

మరిన్ని వార్తలు