అక్రమార్కుల పా‘పాలు’

19 May, 2019 02:29 IST|Sakshi

రైతులకు మూడు, నాలుగు లీటర్లు ఇచ్చే గేదెలను అంటగడుతున్న వైనం

సబ్సిడీ పాడిపశువుల పథకాన్ని అభాసుపాలు చేస్తున్న అధికారులు

రూ.30 వేలు కూడా పలకని పశువులు రూ.80 వేలకు కొనుగోలు

దళారులతో పశు వైద్యాధికారుల కుమ్మక్కు... పాడి రైతులకు అన్యాయం

సాక్షి, హైదరాబాద్‌: సబ్సిడీ పాడి గేదెల పథకాన్ని కొందరు భ్రష్టుపట్టిస్తున్నారు. అక్రమార్కుల పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. 3, 4 లీటర్లు కూడా పాలివ్వని పశువులను కూడా రైతులతో కొనిపిస్తున్నారు. కొందరు అధికారులు, పశువైద్యులు, దళారులు కుమ్మక్కు అయి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో పాలకొరత లేకుండా, స్వయంసమృద్ధి సాధించాలని సర్కారు సంకల్పించింది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గేదెల పథకాన్ని ప్రవేశపెట్టారు.

తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయాలన్నది సర్కారు ఉద్దేశం. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్‌ ధరగా నిర్దారించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ.60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతర లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. మిగిలిన 50 శాతం వాటాను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. యూనిట్‌ ధర రూ.80 వేలలో పాడి పశువు ధర, మూడేళ్ల బీమా, 300 కిలోల దాణా కూడా కలిపారు. కాబట్టి లబ్ధిదారుడు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు.  

కమీషన్ల కోసం కుమ్మక్కు...
నాలుగు డెయిరీల పరిధిలో 2.13 లక్షల మంది పాడి రైతులకుగాను ఇప్పటివరకు 57,567 మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై ఇచ్చారు. అందులో విజయ డెయిరీ పరిధిలో 29,189 మంది రైతులు, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీకి చెందిన 13,878 మంది, ముల్కనూరు మహిళా డెయిరీకి చెందిన 2,942 మంది. కరీంనగర్‌ డెయిరీలో 11,558 మంది పాడి రైతులు ఇప్పటివరకు గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేశారు. వయసు మళ్లిన వాటిని కొనుగోలు చేసి రైతులకు ఇస్తున్నారు. పాడి ఉత్పత్తి గేదెలలో కనీసం 6–10 లీటర్లు, ఆవులలో 8–12 లీటర్లు సామర్థ్యం కలిగి ఉండాలి.

ముర్రా, గ్రేడేడ్‌ ముర్రా గేదెలు, ఆవు జాతి అయిన జెర్సీ, హోలిస్టిన్‌ సంకర జాతి పశువులను కొనవలసి ఉండగా నాటు పశువులను కొంటున్నారు. సబ్సిడీ గేదె బహిరంగ మార్కెట్‌లో రూ.30 వేలకు మించి ధర పలకదని, కానీ దాన్నే రూ.80 వేలకు కొనిపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేదెలను తీసుకొచ్చే ప్రాంతంలోని దళారులతో పశువైద్యులు కొందరు కుమ్మక్కు అయి ప్రతి గేదె పేరిట రూ.10 వేలకుపైగానే కమీషన్‌ కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గేదెలను తీసుకువచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని ఎన్నో సంతలుండగా, ఇతర రాష్ట్రాల్లో కొనిపిస్తూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. పాడి పశువులను కొనకపోతే ఇప్పటికే పోస్తున్న పాలు తీసుకోబోమని పాల కేంద్రాల నిర్వాహకులు, వైద్యం చేయబోమని కొందరు పశు వైద్యాధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పాడి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు ఎంతో ధీమాగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి.

పాడి గేదెల పంపిణీలో అవినీతి
పాడిగేదెల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ పథకంతో రైతుకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టర్లకు, పశువైద్యాధికారులకు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే పాడిగేదె బహిరంగ మార్కెట్‌లో రూ.30 వేలకు మించి ఉండదు. రవాణా ఖర్చులు మాపైనే వేసేందుకు పశువైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకించాను.
– రాగీరు కిష్టయ్య, రైతు, జైకేసారం, చౌటుప్పల్‌ మండలం

మరిన్ని వార్తలు