కాసుల వర్షం కురుస్తుందని..

3 Feb, 2019 04:14 IST|Sakshi

పులి చర్మంపై పూజచేస్తే లక్షలు వస్తాయని నమ్మిన బాధితులు

రూ.6 లక్షలతో ఉడాయించిన చంద్రాపూర్‌ ముఠా సభ్యులు

 ‘సాక్షి’వరుస కథనాలతోపోలీసు శాఖ అప్రమత్తం 

విచారణాధికారిగాసీసీఐ సీఐ శ్రీనివాస్‌కు బాధ్యతలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులి చర్మం మీద డబ్బులు పెట్టి పూజలు చేస్తే మనీ బారిష్‌ (డబ్బుల వర్షం) తో లక్షాధికారులు అవుతామని భావించారు. సహాయపడతారని భావించిన వ్యక్తులే మోసం చేస్తారని ఊహించలేదు. ఉన్నదంతా పోగొట్టుకొని ప్రస్తుతం జైలులో రిమాండ్‌ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నా రు. ఇక అటవీశాఖ అధికారుల ఓవర్‌ యాక్షన్‌తో రూ.6 లక్షలతో అసలు నిందితులు పరారయ్యారు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒకరిద్దరు నిందితులు పోలీ సుల అదుపులో ఉన్నప్పటికీ, అటవీశాఖను, నింది తులను ‘బకరా’లను చేసిన చంద్రపూర్‌ గ్యాంగ్‌ నందు, థామస్, ఆసిఫాబాద్‌ పాండు పత్తా లేకుండా పోయారు. ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీస్‌ శాఖ కూడా పులిచర్మం కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రామగుండం సీపీ సత్యనారాయణ తాజాగా అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ పర్యవేక్షణలో సీసీఎస్‌ సీఐ శ్రీనివాస్‌ను విచారణాధికారిగా నియమించారు. 

పులి చనిపోయాక చర్మంపై ఆశ
జనవరి మొదటి వారంలో కరెంటు తీగల ఉచ్చులో పెద్దపులి పడటంతో బుచ్చిరాజం, మల్లయ్య ముం దుగా భయపడినా, పులి చర్మం అమ్మితే లక్షలు వస్తాయని భావించి చర్మాన్ని, గోర్లను వేరు చేశారు. దాన్ని ఎలా విక్రయించాలనే విషయంలో సాయిలు సహకారం తీసుకున్నారు. సాయిలు నాగారానికి చెందిన బెజపల్లి కొమురయ్యకు చెప్పగా, అతను గోదావరి ఖనిలోని పూర్ణ చెవిన వేశాడు. పులి చర్మాన్ని అమ్మాలంటే ఆసిఫాబాద్‌కు చెందిన పాండుతోనే సాధ్యమవుతుందని చెప్పిన పూర్ణ అతన్ని లైన్‌లోకి తెచ్చాడు. పాండుకు చంద్రాపూర్‌ గ్యాంగ్‌ లీడర్‌ నందుకు చేరవేశాడు. నందు తన సహచరుడు థామస్‌తో చర్చించి పాండును తమవైపు తిప్పుకున్నారు. ‘పైసా బారిష్‌’ ప్లాన్‌కు మెరుగులు దిద్దారు. ఇంటి ఓనర్‌ అంజయ్య ను లక్ష్యంగా చేసుకొని పావులు కదిపారు. 

పైసా బారిష్‌ కోసం రూ.6 లక్షలు సమర్పణ
తొలుత పులి చర్మాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన నందు గ్యాంగ్‌ చర్మాన్ని మందమర్రిలోని అంజయ్య ఇంటికి తెప్పించారు. బంగారు బాతు కథ తరహాలో పులి చర్మం దగ్గరుంటే కోట్లు సంపాదించవచ్చని నందు, థామస్, పాండులు అంజయ్యకు చెప్పారు. పులి చర్మంపై ఎంత డబ్బులు పెట్టి పూజలు చేస్తే అంతకు రెట్టింపు అవుతాయని చెప్పారు. దీంతో కొమురయ్య, నర్సయ్య, సాయిలు తదితరులను నమ్మించారు.

దీంతో వారు రూ.6 లక్షలను తీసుకుని పరారయ్యారు. వెళ్తూనే నందు మంచిర్యాల ఓఎఫ్‌డీవో వెంకటేశ్వర్‌రావుకు ఫోన్‌చేసి, టైగర్‌ హంటింగ్‌ ఎండ్‌ అసోసియేషన్‌ సభ్యుడు థామస్‌ పులి చర్మం కొనుగోలుదారుడిగా నిందితులతో బేరమాడుతున్నారని, వెంటనే వెళ్లాలని సమాచారం ఇచ్చాడు. అధికారులు మందమర్రికి వచ్చి పులిచర్మం, ఇంటి యజమాని అంజయ్యతోపాటు డబ్బులు సమకూర్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పుడేస్పందించిఉంటే...
మందమర్రిలో పులి చర్మం విక్రయించే ముఠా ఉన్నట్లు సమాచారం అందగానే లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు సమాచారం అంది చ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. చర్మం దొరికిందనే కోణంలోనే అటవీ శాఖ అధికారులు వ్యవహరించారే తప్ప అది ఎక్కడి పులికి సంబంధించినదనే విషయంపై దృష్టి పెట్టలేదు. దీంతో చంద్రాపూర్‌ గ్యాంగ్‌కు చెందిన థామస్‌ అటవీశాఖ కార్యాలయం వరకు వచ్చి, మీడియా ముందు కథలు చెప్పి తప్పించుకుపోయాడు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ రంగంలోకి దిగిన తరువాతే అసలు రంగు బయట పడుతోంది. అడిషనల్‌ డీసీపీ అశోక్‌కుమార్, సీసీఎస్‌ సీఐ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్‌ సీఐ సాగర్‌ పులి చర్మం, పులి వేటపై ప్రత్యేక దృష్టి సారించారు.


 

మరిన్ని వార్తలు