‘ట్రాన్స్‌మిషన్’ మాయ!

9 Jun, 2014 23:40 IST|Sakshi
‘ట్రాన్స్‌మిషన్’ మాయ!

యాచారం: విద్యుత్ ట్రాన్స్‌మిషన్ అధికారుల మాయతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. రైతుల అంగీకారం లేకుండానే పచ్చటి వ్యవసాయ భూముల్లో అధికారులు టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. తమ భూముల్లో టవర్లు ఏర్పాటు చేయొద్దని అన్నదాతలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వమే వేయిస్తోంది.. అడ్డుకుంటే కేసుల పాలవుతారని వారు భయపెడుతున్నారు.  దీంతో ఆందోళనకు గురైన రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.
 
విశాఖపట్నం నుంచి నల్గొండ జిల్లా సూర్యాపేట మీదుగా జిల్లాలోని శంకర్‌పల్లి వరకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన ఓ వ్యాపార సంస్థ 400 కేవీ విద్యుత్ తీగల టవర్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మంచాల మండలం నుంచి శంకర్‌పల్లి వరకు 124 కిలోమీటర్ల పరిధిలో 386 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి, మల్కీజ్‌గూడ, కుర్మిద్ద తదితర గ్రామాల నుంచి భారీ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ పరిధిలో పది నుంచి 15 వరకూ టవర్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇలా వందలాది గ్రామాల మీదుగా టవర్లు ఏర్పాటుకు నిర్ణయించారు.  ఒక టవర్ ఏర్పాటుకు పది గుంటల భూమి అవసరముంటుంది.
 
రైతుల అంగీకారం లేకుండానే...  
టవర్లను ఏర్పాటు చేసే ట్రాన్స్‌మిషన్ సంస్థ ముందుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి విషయాన్ని రైతులకు తెలియజేయాలి. చట్టంలోని నింబంధనల ప్రకారం.. రైతులు ఒప్పుకుంటేనే టవర్ల ఏర్పాటుకు కదలాలి. కానీ ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండానే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ అధికారులు అత్యవసర సేవలంటూ... అడ్డుకుంటే కేసుల పాలవుతారని రైతులను భయపెడుతున్నారు.  దీంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మండలంలోని పలు గ్రామాల రైతులు తమ భూముల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు విషయమై మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధితాధికారులతో మాట్లాడారు.
 
టవర్లు ఏర్పాటు చేసే సంస్థ ప్రైవేట్ కార్పొరేషన్ అని తెలిసింది. నిబంధనల ప్రకారం రైతుల అంగీకారం ఉంటేనే టవర్లు ఏర్పాటు చేయాలి. న్యాయబద్ధంగా పరిహారం అందజేసి ఆ  తర్వాతే టవర్ల ఏర్పాటుకు పూనుకోవాలి. టవర్ల ఏర్పాటు ప్రారంభంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. భూములు కోల్పోయే రైతులతో ట్రాన్స్‌మిషన్ అధికారులు అంగీకార పత్రం రాయించుకున్నారు. రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకూ పరిహారం అందజేస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ రైతులు చెప్పులరిగేలా తిరిగాక రూ. 15 వేలు అందజేసి చేతులు దులుపుకొన్నారు.  కేవలం ఒకరిద్దరి రైతులకు మాత్రమే నగదు అందజేసి మిగతా వారిని భయపెట్టే పనిలో ఉన్నారు.
 
భూములు కోల్పోవడానికి ససేమిరా..
నిబంధనల ప్రకారం ట్రాన్స్‌మిషన్ అధికారులు వ్యవహరించడం లేదని తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు రెండు, మూడు రోజులుగా యాచారం, మల్కీజ్‌గూడ తదితర గ్రామాల్లో టవర్ల పనులు జరగ్గాకుండా అడ్డుకుంటున్నారు. కేసులైనా నమోదు చేయండి కానీ తమ భూముల్లో టవర్లను మాత్రం బిగించనీయమని ఆందోళనకు దిగుతున్నారు. టవర్లు పచ్చటి వ్యవసాయ భూముల్లో నుంచి పోతున్నాయి. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవసాయానికి పనికిరాని భూముల్లోంచి టవర్లను ఏర్పాటు చేయాలి. అది కూడా రైతుల అంగీకారం మేరకే జరగాలి.
 
టవర్ల ఏర్పాటుతో పది గుంటల భూమి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది.  జిల్లా పరిధిలోని పలు మండలాలు నగరానికి సమీపంలో ఉండడంతో భూములకు మంచి డిమాండ్ ఉంది.టవర్లు శాశ్వతంగా ఉండే ప్రమాదం ఉండడంతో సదరు భూములకు అమాంతం డిమాండ్ తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలిచి టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు