రూల్స్‌కు గేట్లేవీ?

28 Jul, 2014 07:16 IST|Sakshi
రూల్స్‌కు గేట్లేవీ?

సాక్షి, హైదరాబాద్: పదమూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు.. వేల కిలోమీటర్ల మార్గాలు.. లక్షల కోట్లలో బడ్జెట్.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు.. ఇది భారత రైల్వే ఘనత.. కానీ అదే రైల్వే నిత్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కనీస రక్షణ ఏర్పాట్లు చేయలేక ఏటా వందలాది మందిని బలిగొంటోంది.. దీనికితోడు ప్రభుత్వ అడ్డగోలు ని‘బంధ’నాలతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.. ప్రభుత్వం, రైల్వేశాఖల నిర్లక్ష్యం, నిర్లిప్తత, అసమర్థత, అడ్డగోలు నిబంధనలు.. వెరసి తప్పెవరిదైనా చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అమాయకులు మాత్రం బలవుతున్నారు.
 
 అసలు దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదిన్నర క్రితమే గేట్ల వద్ద ఉండే సిబ్బందికి సంబంధించి 62 పోస్టులు మంజూరయ్యాయి. కానీ అంత మేర వేరే విభాగంలో సిబ్బంది సంఖ్యను కుదిస్తేగాని ఆ పోస్టుల భర్తీ సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పటంతో.. ఆ ఫైల్ ఢిల్లీలో దుమ్ముకొట్టుకుపోతోంది. దానికి ఇదివరకే మోక్షం లభించి ఉంటే మాసాయిపేట లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది చిన్నారులు మరణించి ఉండేవారు కారేమో!
 
 వ్యయం.. భయం!
 
 ఒక చోట రైల్వే గేటు ఏర్పాటు చేయాలంటే... గేటు, కాపలాదారులు కూర్చునే గది, ఇతర సామగ్రికి కలిపి రూ. 25 లక్షల నుంచి 35 ల క్షల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ మూడు షిఫ్టు (8గంటల చొప్పున)ల్లో ముగ్గురు కాపలా సిబ్బంది అవసరం. ఆరో వేతన సంఘం నిబంధనల ప్రకారం కాపలా సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 15వేల నుంచి 20 వేల వరకు వేతనం (డీఏ సహా) చెల్లించాలి. అంటే ముగ్గురికి కలిపి నెలకు రూ. 60 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క గేటుకు ఇంత ఖర్చు చేయాల్సి వస్తే.. దేశంలోని అన్ని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటుకు ఒక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే దీన్ని రైల్వే శాఖ భారంగా భావిస్తోంది.
 
 ఒక చోట తొలగిస్తేనే..
 
 ప్రస్తుతం రైల్వేశాఖకు మానవ వనరుల(సిబ్బంది) కేటాయింపు అధికారం లేదు. 2003లో ఆ అధికారాన్ని ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చారు. రైల్వే శాఖ గేట్ల వద్ద సిబ్బంది అవసరం ఉందంటూ ఆర్థిక శాఖను కోరితే... అంతే సంఖ్యలో సిబ్బందిని ఎక్కడైనా తగ్గిస్తే కేటాయిస్తామని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. అంటే ఒకచోట సిబ్బందిని నియమించాలంటే మరోచోట తొలగించాలన్న మాట. ఉదాహరణకు దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదిన్నర కింద 62 గేటు సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. కానీ ఆ 62 పోస్టులను ఎక్కడ తగ్గించాలో రైల్వేశాఖ తేల్చుకోలేకపోవడంతో ఏడాదిన్నరగా ఫైల్ పెండింగులో పడిపోయింది.


 నిబంధనలే అసలు సమస్య


 కనీసం నెలలో 20 వేల వాహనాలు తిరిగే రోడ్డు ఉన్న చోట మాత్రమే గేటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రైల్వేశాఖ నిబంధన పెట్టుకుంది. ఇందుకోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక సెన్సెస్ నిర్వహిస్తుంది. నిర్ధారిత సంఖ్య కంటే తక్కువగా వాహనాల ట్రాఫిక్ ఉన్న చోట్ల గేట్లు ఏర్పాటు చేయాలంటే.. అందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖ గేట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు-రైల్వే శాఖకు మధ్య సయోధ్య కుదరటం లేదు.
 
  ఇక నెలలో 50 వేల వరకు వాహనాలు తిరిగే రోడ్లున్న చోట రైల్వే సిగ్నల్‌తో అనుసంధానమయ్యే సిగ్నల్ ఇంటర్ లాకింగ్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుంది. దీంతో ఖర్చుకు భయపడుతున్న రైల్వే శాఖ అతి ముఖ్యమైన మార్గాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తోంది.
 
  రెండు లైన్లు ఉండి, గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లే రైళ్లు, గణనీయ సంఖ్యలో రైళ్లు తిరిగే మార్గాలను ఏ క్లాస్ రూట్లుగా రైల్వే శాఖ పేర్కొంటోంది. ఈ మార్గాల్లో మాత్రమే గేట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతోంది. కానీ దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి మార్గాలు కొన్నే. మిగతా కేటగిరీ మార్గాలే ఎక్కువ. వాటిని గాలికొదిలేయడంతో... తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మాసాయిపేట క్రాసింగ్ కూడా ఇలాంటి జాబితాలోనే ఉండిపోయింది.
 
 కకోద్కర్ కమిటీ నివేదిక బుట్టదాఖలు
 
 రైల్వేల్లో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2011 సెప్టెంబర్‌లో కేంద్రం ఏర్పాటు చేసిన అనిల్ కకోద్కర్ కమిటీ 2012లో నివేదిక అందజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,896 కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద పరిస్థితిని సరిదిద్దాలంటే రూ. 50 వేల కోట్లు ఖర్చవుతుందని తేల్చింది. రైలు ప్రమాదాల్లో 40 శాతం వరకూ కాపలాలేని క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

 

మరిన్ని వార్తలు