ఈ సారికి ఎంసెటే!

20 Oct, 2018 02:32 IST|Sakshi

జాతీయ స్థాయి పరీక్షతో ప్రవేశాలపై స్పష్టత కరువు

ఇప్పటికే రెండుసార్లు జేఈఈ నిర్వహణకు నోటిఫికేషన్‌  

తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూలు జారీ

అయినా రాష్ట్రాల్లో సొంత పరీక్షలపై స్పష్టత ఇవ్వని కేంద్రం  

వచ్చే ఏడాది ఎంసెట్‌ నిర్వహణకు అధికారుల యోచన

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు చేపట్టే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎంసెట్‌ను రద్దు చేయాలా? అని అప్పట్లో అధికారులు ఆలోచించారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్స్‌ ఆధారంగానే ప్రవేశాలు చేపడుతున్నాయని, అన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్న చర్చను కేంద్రం తీసుకువచ్చింది. అయితే ఆ తరువాత దానిపై మళ్లీ స్పందించలేదు.

ఒకే పరీక్ష (జేఈఈ మెయిన్స్‌) ద్వారా ప్రవేశాలు చేపట్టే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ నిర్వహణవైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్‌ స్కోర్‌తోపాటు ఇంటర్మీడియట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారికి ఎంసెట్‌ను యథావిధిగా కొనసాగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసే వరకు ఎంసెట్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు.

జేఈఈలోనూ స్పష్టత కరువు: జేఈఈ మెయిన్స్‌ను ఇన్నాళ్లు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించింది. అయితే ఇప్పుడు దీంతోపాటు యూజీసీ నెట్, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఎన్‌టీఏను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌టీఏ తమ పనిని కూడా కొనసాగిస్తోంది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో 2019 ప్రవేశాలు చేపట్టేందుకు జేఈఈ మెయిన్స్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులను కూడా స్వీకరించింది. జనవరి 6 నుంచి 20 వరకు మొదటి విడత జేఈఈ, ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు రెండో విడత జేఈఈ నిర్వహణకు చర్యలు చేపట్టింది.

అయితే ఇందులో రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ప్రవేశాలకు ప్రత్యేక ప్రవేశ పరీక్షపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్‌ ఏటా రెండుసార్లు నిర్వహించే షెడ్యూలు జారీ చేయడం కూడా కొంత గందరగోళానికి కారణమైంది. రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల ద్వారా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో తక్కువగా ఉండే కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టవచ్చు, కానీ రాష్ట్రంలో లక్ష వరకు ఉండే సీట్లను రెండు పరీక్షల్లోని అర్హులను తీసుకొని ప్రవేశాలు చేపట్టడం గందరగోళానికి దారితీస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

సమన్వయం కూడా సమస్యే...
ఎన్‌టీఏ అనేది జాతీయ స్థాయి సంస్థ కావడం, రాష్ట్రంలోని ఉన్నత విద్య శాఖకు దానికి మధ్య సమన్వయం కుదరదని, వివరాలు తీసుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని, ప్రస్తుతం ఉన్న వెయిటేజీ సమస్య కూడా వస్తుందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో 2019లో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే (ఎంసెట్‌ ద్వారానే) ప్రవేశాలు చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది.

పైగా కేంద్ర ప్రభుత్వమే రెండుసార్లు జేఈఈ మెయిన్స్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్‌తోనే ప్రవేశాలు చేపట్టడం మంచిదని భావిస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్స్‌ మొదటి దఫా పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ, ఏప్రిల్‌ జరిగే జరిగే రెండో దఫా దరఖాస్తులను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో స్వీకరించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ విధానాన్ని అనుసరిస్తారన్న అంశంపై వీలైనంత త్వరగా ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా విద్యార్థుల్లో గందరగోళం తొలగిపోతుందని వెల్లడించారు. పైగా వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రిపరేషన్, ప్రాక్టికల్‌ పరీక్షలు, వార్షిక పరీక్షలు ఉంటాయి కనుక ముందుగా స్పష్టతిస్తే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయా పరీక్షలకు సిద్ధం అవుతారని వివరించారు.

>
మరిన్ని వార్తలు