ఇది ప్రజాస్వామ్య వైఫల్యం

10 Jun, 2019 04:09 IST|Sakshi

హైదరాబాద్‌: పరిపాలన ప్రజలకు అర్థం కాకపోవటం అంటే అది ప్రజాస్వామ్య వైఫల్యమేనని లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్‌ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘స్థానిక ప్రభుత్వాలు– సాధికారత, ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు విద్య అందటం లేదంటే సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.

ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పిల్లలకు చదువు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 40 వేల కోట్లు పాఠశాల విద్యకు ఖర్చు అవుతున్నా నూటికి 60 శాతం మందికి చదువు రావటం లేదన్నారు. స్థానిక నాయకత్వ లోపం వల్లనే మెరుగైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా విద్యకు ఖర్చు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు లేవన్నారు.

ఇన్ని అనర్థాలకు మూలం అధికారాన్ని ప్రజలకు దూరం చేయటమేనన్నారు. మనుషులు మారుతున్నారే తప్ప పాలన మారటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల మిగులు తో ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఏమీ లేదని, వృథా ఖర్చులు పెరగటం వల్లనే అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్, లోక్‌సత్తా పార్టీ కన్వీనర్‌ తుమ్మనపల్లి శ్రీనివాసు, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కటారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు