అంతా తూచ్‌.. గుప్త నిధుల్లేవు..

7 Oct, 2017 16:32 IST|Sakshi

సాక్షి, పరిగి : ఓ పురాతన ఇళ్లును కూల్చివేస్తుండగా దొరికిన పురాతన పెట్టెలో గుప్త నిధులున్నాయంటూ ప్రచారం జరిగిన ఆ పెట్టెను శనివారం తహశీల్దార్‌ సమక్షంలో అత్యంత ఉత్కంఠ నడుమ పోలీసులు తెరిచారు. తీరా బాక్స్‌ ఖాళీగా ఉండటంతో పరిగి ప్రజలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మార్కెట్‌ యార్డులో పురాతన ఇళ్లు కూల్చి వేస్తుండగా శుక్రవారం రాత్రి ఓ పెట్టె లభ్యమైన విషయం తెలిసిందే. ఈ పెట్టె పురాతన గల్లపెట్టె మాదిరి ఉండటంతో గుప్తనిధులు ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరి పెట్టెను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

శనివారం తహశీల్ధార్‌ సమక్షంలో తెరుస్తామని చెప్పారు. దీంతో చుట్టు పక్కల ప్రజలంతా ఆతృతతో తహశీల్దార్‌ కార్యాలయానికి చేరారు. తీరా పెట్టెను తెరిచి చూస్తే అందులో ఎలాంటి నిధులు లేవు. దీంతో అక్కడికి చేరిన ప్రజలంతా నిరాశతో వెనుదిరిగారు. పట్టణానికి చెందిన మనోహర్‌ తన పాత ఇంటిని ఇతరులకు విక్రయించాడు.  కొనుగోలుదారుడు శుక్రవారం రాత్రి జేసీబీతో ఇళ్లు కూల్చివేస్తుండగా ఈ పురాతన పెట్ట బయటపడింది.

మరిన్ని వార్తలు