విద్యార్థులున్నా.. కాలేజీలు సున్నా

23 Aug, 2018 03:15 IST|Sakshi

రాష్ట్రంలోని 106 మండలాల్లో ఒక్క జూనియర్‌ కాలేజీ లేదు

వందల్లో విద్యార్థులున్నా పట్టించుకోని అధికారులు

ఆసక్తి చూపని ప్రైవేటు యాజమాన్యాలు

విద్యార్థుల తంటాలు.. చదువు కోసం పక్క మండలాలకు

అవసరమున్న చోట ఏర్పాటు చేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ :  పాత మహబూబ్‌నగర్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలంలో 6 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఓ ఎయిడెడ్‌ పాఠశాల, మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి. వాటిల్లో 533 మంది పదో తరగతి చదువుతున్నారు. కానీ అక్కడ ఒక్క జూనియర్‌ కాలేజీ లేదు. దీంతో ఇంటర్‌ చదివేందుకు విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు.
  వికారాబాద్‌ జిల్లా బొమ్రాస్‌పేట్‌ మండలంలో 4 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ, ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వాటిల్లో 441 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడా ఒక్క జూనియర్‌ కాలేజీ లేదు. దీంతో ఇంటర్‌ కోసం ఇతర మండలాల్లోని ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తుండగా మరికొంత మంది పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్నారు.  

ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని 106 మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుపై ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారులు దృష్టి సారించకపోగా, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో ఆయా మండలాల్లోని విద్యార్థులు నిత్యం ఇతర ప్రాంతాల్లోనే కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత 125 మండలాలు పెరిగాయి. దీంతో మండలాల సంఖ్య 584కి చేరింది. కానీ 106 మండలాల్లో ఒక్క కాలేజీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలే కాదు.. పాత మండలాల్లోనూ కాలేజీలు లేక పిల్లల్ని ఇతర మండలాలకు పంపాల్సి వస్తోందని వాపోతున్నారు.

ప్రజా ప్రతినిధులు, స్థానికుల ఒత్తిడి
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. గతంలో 10 జిల్లాలుండగా వాటిని 31 జిల్లాలు చేయడం.. పాత మండలాలు 459 ఉండగా 584కు పెంచడంతో జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు స్థానికులు డిమాండ్‌ చేస్తు న్నారు. ఐదారు ఉన్నత పాఠశాలలున్న గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక్క జూనియర్‌ కాలేజీ లేని మండలాల్లో ఏర్పాటుకు ఒత్తిడి తెస్తున్నారు.

కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలూ సిద్ధం చేయించి ఇంటర్‌ విద్యా శాఖకు పంపుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు లేవు.. ఏయే మండలాల్లో ప్రైవేటు కాలేజీలున్నాయి.. అసలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ లు లేని మండలాలు ఏవో లెక్కలు తేల్చారు. మొత్తం గా 106 మండలాల్లో అటు ప్రభుత్వ జూనియర్‌ కాలే జీ గాని, ఇటు ప్రైవేటు కాలేజీ కానీ లేదని తేల్చారు. వాటి విషయంలో ఏం చేయాలని యోచిస్తున్నారు.

కాలేజీలు లేని మండలాలు మరిన్ని..
వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండంలో 8 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ ఉంది. వాటిల్లో 459 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు జూనియర్‌ కాలేజీ ఒక్కటీ లేదు. అదే జిల్లాలోని కోటపల్లిలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా పదో తరగతి విద్యార్థులు 203 మంది ఉన్నారు. అక్కడా ఒక్క కాలేజీ లేదు. జనగా మ జిల్లాలో తరిగొప్పుల, వరంగల్‌ రూరల్‌ జిల్లా లోని దుగ్గొండి, నల్లబెల్లి, యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, నిర్మల్‌ జిల్లా లోని బాసర, నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో జూనియర్‌ కాలేజీలు లేవు.   

డిమాండ్‌ ఉన్న చోట ఏర్పాటు చేయాలి
ఉన్నత పాఠశాలలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న మండలాల్లో డిమాండ్‌ మేరకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కాలేజీలు లేని కొత్త మండలాలతో పాటు పాత మండలాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపాలి.   – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు