కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు స్వస్తి

11 Jul, 2020 03:29 IST|Sakshi

ఇళ్లలో చికిత్స పొందేవారికి ఊరట

పోలీసు జోక్యం ఉండదు 

గోప్యతకు భంగం కలుగదు 

అందువల్ల సరైన వివరాలు ఇవ్వాలని అధికారుల విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు వైద్య ఆరోగ్యశాఖ స్వస్తి పలకాలని నిర్ణయించింది.  ఎవరికైనా పాజిటివ్‌ వస్తే, వారికి వైరస్‌ ఎలా వచ్చిందో గుర్తించేందుకు కాంటాక్ట్‌లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఎలా సోకింది? నాలుగైదు రోజులుగా ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు?  ఏమేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  వారుండే అపార్ట్‌మెంట్‌ లేదా ఇంటి పక్కనవారిని కూడా కలిసి ఆరా తీస్తున్నారు. ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా పోలీసులు చేస్తున్న ట్రేసింగ్‌ బాధితులకు ఇబ్బందిగా మారుతోందన్న ఫిర్యా దులు వెల్లువెత్తాయి.

దీంతో సాధారణ లక్షణాలతో ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి సామాజిక బహిష్కరణ పాలవుతున్నారు. అపార్టుమెంట్లలో ఉండేవారైతే వారిని అక్కడ ఉండొద్దని, ఆసుపత్రికి వెళ్లమని ఒత్తిడి చేస్తున్నారు. గత నెల వైద్య ఆరోగ్యశాఖకు చెం దిన ఒక కీలకాధికారికి పాజిటివ్‌ వస్తే, సాధారణ లక్షణాలున్నా అపార్ట్‌మెంట్‌వాసుల ఒత్తిడితో ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో  కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు కరోనా రాష్ట్ర ఉన్నతస్థాయి సభ్యులు ఒకరు తెలిపారు. ఇళ్లలో ఉండి చికిత్స పొందేవారి గోప్యతకు భంగం కలిగించబోమన్నారు.

తప్పుడు అడ్రస్‌లు... ఫోన్‌ నెంబర్లు 
పోలీసులు, స్థానిక వైద్యాధికారుల హడావుడితో సామాజిక బహిష్కరణకు గురవుతామని బాధితులు చాలామంది కరోనా నిర్ధారణ పరీక్షల సమయంలోనే ఆధార్, ఫోన్‌ నంబర్ల ద్వారా అడ్రస్‌ తెలుసుకుంటున్నారు. దీంతో కొందరు తప్పుడు ఫోన్‌ నెంబర్లు ఇస్తున్నారు. కొందరైతే తప్పుడు పేర్లు కూడా ఇస్తున్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రముఖులుగా చలామణి అయ్యేవారు తమ పేర్లు కూడా తప్పుగా ఇస్తున్నట్లు సమాచారం. ఇలా తప్పుడు అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లతో శాంపిళ్లు ఇచ్చిన వారిలో ఎవరిౖకైనా కరోనా పాజిటివ్‌ వస్తే, వారికి సమాచారం ఇచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని వస్తుంది. అడ్రస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదని తెలుస్తుంది. దీంతో అటువంటి వారికి సమాచారం ఇవ్వడం గగనంగా మారింది. ఇలా తప్పుడు వివరాలు ఇచ్చే వారు దాదాపు 20 శాతం మంది వరకు ఉంటారని ఆ అధికారి వెల్లడించారు. ఇది తమకు తలనొప్పిగా మారిందంటున్నారు. అలా తప్పుడు సమాచారం ఇచ్చినవారు తమకు తెలిసినవారి ద్వారా పాజిటివ్‌ వచ్చిందా... నెగెటివ్‌ వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇకనుంచి బేఫికర్‌... 
ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో ఎక్కువమంది ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నవారే. హైదరాబాద్‌లో దాదాపు 10 వేల మందికి పైగా ఇలా ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షణాలు పెద్దగా లేనివారికి, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందే వారికి ఇబ్బందిగా మారిన ట్రేసింగ్‌ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. కేవలం వైద్య ఆరోగ్యశాఖకు చెందిన స్థానిక అధికారులు లేదా డాక్టర్లు మాత్రమే వారిని పర్యవేక్షిస్తారని, వారితో టచ్‌లో ఉంటారని తెలిపాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా