ఒక్క నామినేషన్‌ వస్తే ఒట్టు!

19 Jan, 2019 02:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 3 గ్రామాల పరిస్థితి

వందుర్‌గూడ, గూడెం, నెల్కి వెంకటాపూర్‌ల్లో నామినేషన్లు నిల్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులకూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఒక్క గిరిజనుడూ లేని 2 గ్రామాలను ఏజెన్సీలుగా నోటిఫై చేయగా, అక్కడి 2 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. కొత్త పం చాయతీ ఏర్పాటును వ్యతిరేకించిన ఓ గ్రామం ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో మంచిర్యాల జిల్లాలోని 3గ్రామాల్లో ఈసారి ఎన్నికలు జరగడం లేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ప్రసిద్ధ సత్యనారాయణ స్వామి ఆలయం నెలకొని ఉన్న గూడెం గ్రామ పంచాయతీని 1987లోనే ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. ఈ గ్రామంలో ఒక్క ఎస్టీ లేకపోవడంతో ఈ సారీ నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యులు సగం మంది గిరిజనేతరులు అందుబాటులో ఉన్నప్పటికీ, సర్పంచ్‌కి ఎన్నిక జరగకుండా వార్డులకు పోటీ చేయడం ఎందుకని ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. 1987 నుంచి అంటే 32 ఏళ్లుగా ఇక్కడ ఎన్నిక జరగలేదు.

ఇదే మండలంలోని నెల్కి వెంకటాపూర్‌ గ్రామం ఇదే జాబితాలో చేరింది. ఏజెన్సీ గ్రామంగా ఉన్న ఈ పంచాయతీని పునర్విభజనలో వందుర్‌గూడ పంచాయతీగా మార్చారు. ఎస్టీ వర్గంతో కూడిన వందూర్‌పల్లిని పంచాయతీగా మార్చగా నెల్కివెంకటాపూర్‌ లో ఎస్టీలు లేకుండాపోయారు. ఎస్టీలను ప్రత్యేక పంచాయతీగా మార్చినా, నెల్కి వెంకటాపూర్‌ను ఏజెన్సీ గ్రామంగా డీనోటిఫై చేయలేదు. దాంతో ఎస్టీలు లేని ఈ పంచాయతీలో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక నెల్కి వెంకటాపూర్‌ గ్రామం నుంచి విభజించి ప్రత్యేక పంచాయతీగా మార్చిన వందుర్‌గూడ ఏజెన్సీ గ్రామంలో గిరిజనులు, ఇతర వర్గాల వారు ఎన్నికలను బహిష్కరించారు. నెల్కి వెంకటాపూర్‌ గ్రామం నుంచి విడిపోవడం ఈ గ్రామస్తులకు ఇష్టం లేకపోవడంతో ఎన్నికను బహిష్కరించారు. మూడో విడత నామినేషన్ల చివరి రోజు శుక్రవారం నాటికి ఈ 3 గ్రామాల్లో ఒక్కరూ నామినేషన్లు వేయలేదు.   

మరిన్ని వార్తలు