ఆశలెక్కువ..అసలు తక్కువ

3 Feb, 2018 01:20 IST|Sakshi

     ఐదేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణకు అరకొరే 

     రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆశించింది రూ.81 వేల కోట్లు 

     ఇప్పటివరకు వచ్చింది రూ. 32 వేల కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతి బడ్జెట్‌లో తెలంగాణ ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తూ వస్తోంది. వరుసగా ఐదేళ్లు ప్రత్యేక కేటాయింపులు, వరాలేమీ ఇవ్వకుండా దాటవేసింది. ఇస్తామని చెబుతున్న నిధులు కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలేసుకోవడం.. వాస్తవ కేటాయింపులు మరోలా ఉండటంతో ఏటేటా ఈ అంతరం పెరిగిపోతోంది. 2014–15 నుంచి ప్రస్తుత ఏడాది వరకు కేంద్రం నుంచి రూ. 81 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసుకోగా ఇప్పటివరకు రూ. 32 వేల కోట్లకు మించి నిధులు రాలేదు. అంటే అంచనాలకు, వాస్తవాలకు కనీసం పొంతన కుదరనంత వ్యత్యాసం కనిపిస్తోంది.  

ముందే తేలుద్ది..
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా ఎన్ని నిధులొస్తాయో ముందే లెక్క తేలుతుంది. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే ఏయే రాష్ట్రాలకు ఎన్ని నిధులందుతాయో అంచనాకు రావొచ్చు. అందుకే చాలా రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్‌ ఆధారంగానే వార్షిక బడ్జెట్‌ తయారు చేసుకుంటాయి. కేంద్ర పన్నుల్లో వాటా, ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చే నిధులను అందులో పొందుపరుస్తాయి. ఆర్థిక సంఘం గ్రాంట్లను 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు ఇవ్వడం తప్పనిసరి. అందులో కోత పడే అవకాశం లేదు. పన్నుల వాటా, కేంద్ర పథకాలకు కేటాయింపుల్లో కేంద్రం అంచనాలు తలకిందులైతేనే నిధుల విడుదలపై ప్రభావం పడుతుంది. కానీ గత నాలుగేళ్లలో కేంద్రం ప్రకటించిన.. రాష్ట్రానికి విడుదల చేసిన నిధులకు భారీగా తేడా కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం ఉంటోంది.  

తొలి ఏడాది నుంచే..
 కొత్త రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నుంచి ఆ ఊసే లేదు. మరోవైపు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు రూ.40 వేల కోట్లు కేటాయించాలని పలుమార్లు ఢిల్లీని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.కానీ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.900 కోట్లు మినహా అన్నింటినీ కేంద్రం తోసిపుచ్చింది. వీటికి తోడు పన్నుల వాటా, పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పెట్టింది.

కేంద్రం లెక్కలు వేరే..
గత మార్చి నుంచి రూ.26 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికీ అందులో నాలుగో వంతే రాష్ట్రానికి విడుదలయ్యాయి. కానీ రూ. 21 వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వాటి నిర్వహణ నిధులనూ రాష్ట్ర ఖజానాకు ఇచ్చినట్లు లెక్కలేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే కేంద్రం లెక్కలకు, రాష్ట్రం గణాంకాలకు పొంతన 
కుదరటం లేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి పునరావృతమైంది.

మరిన్ని వార్తలు