చిట్ట చివరి రైతు దాకా రైతుబంధు అందాలి: కేసీఆర్‌

11 Jul, 2020 19:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని పేర్కొన్నారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. (ఆలయం, మసీదులకు కాకతాళీయంగానే నష్టం)

కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసిందని. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందన్నారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అని తెలుసుకునిడబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపిందన్నారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని సూచించారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తుందని, రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. (టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరం)

‘రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. ఈ విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’ అని  సీఎం కేసీర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. (సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్‌)

మరిన్ని వార్తలు