కేసీఆర్‌ ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ

20 May, 2019 03:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామగుండం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయ ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.1,500 కోట్లతో 2016లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్టీపీసీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా రాలేదని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు.

ఎన్టీపీసీ ప్లాంట్‌ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్‌ పూర్తిగా రాష్ట్రానికే వస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, దీనికి కారణమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రంతో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని కేసీఆర్‌ పేర్కొనడం అబద్ధమన్నారు. మోదీ బాధ్యతలు చేపట్టాక రైతులకు ఎరువుల కష్టాలు తీర్చడంలో భాగంగా ఖాయిలా పడ్డ ఎరువుల పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నారన్నారు.   

మరిన్ని వార్తలు