కేలరీ యాప్‌లా.. కాస్త కేర్‌ఫుల్‌! 

2 Jul, 2019 03:29 IST|Sakshi

ప్రయోజనం తక్కువే అంటున్న ఎన్‌ఐఎన్‌ 

20 అప్లికేషన్లపై అధ్యయనం 

మన అలవాట్లకు అనుగుణంగా లేనివే ఎక్కువ 

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. బోలెడన్ని పనులు చేసేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఈ జాబితాలో ఒకటి. తినే ఆహారంలో ఎన్ని కేలరీలున్నాయో? లెక్కకట్టి చెప్పేందుకు గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఎన్నో అప్లికేషన్లు ఉన్నాయి. మరి ఇలాంటి అప్లికేషన్ల ద్వారా మనకందే సమాచారం సరైందేనా? మరీ ముఖ్యంగా ఎక్కడో పాశ్చాత్యదేశాల జనాభాకు అనుగుణమైన కేలరీల లెక్క మనకూ సరిపోతుందా? దైనందిన కార్యకలాపాల ద్వారా ఎన్ని కేలరీలు కోల్పోతున్నామో ఇవి కచ్చితంగా లెక్కకట్టగలవా? ఆసక్తికరమైన ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పౌష్టికాహార సంస్థ! 

ఒక్కోటి ఒక్కో సమాచారం 
ఈ అధ్యయనంలో భాగంగా వారు గూగుల్‌ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న 20 అప్లికేషన్లను ఎంపిక చేసుకున్నారు. అంతర్జాతీయంగా శాస్త్రీయంగా అమల్లో ఉన్న ప్రమాణాలను మన జనాభాకు తగ్గట్టుగా మార్పులు చేసి 55 పాయింట్ల స్కేల్‌తో అప్లికేషన్లను బేరీజు వేశారు. 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అప్లికేషన్లను నాణ్యమైనవిగా గుర్తించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో భాగంగా పరిశీలించిన 20 అప్లికేషన్లలో 13 ఈ నాణ్యతకు దిగువన ఉన్నాయి. చాలా అప్లికేషన్లు వాడిన సమాచారం శాస్త్రీయ ప్రమాణాలకు నిలబడేవి కానేకావని తేలింది. వ్యక్తుల శారీరక శ్రమను పరిగణలోకి తీసుకోకుండా కేలరీ అవసరాలను లెక్కకట్టిన అప్లికేషన్లు ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమైంది. ‘ఒకవేళ మీరు ఈ 20 అప్లికేషన్లను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని వాడితే.. ఒక్కోటి ఒక్కో రకమైన అంకెలను చూపిస్తుంది’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎం.గవరవరపు సుబ్బారావు తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తూ.. ‘పెద్దగా శారీరక శ్రమ చేయని 22 ఏళ్ల మహిళను ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు 66 కిలోల బరువున్న ఈ మహిళ వారానికి అర కిలో బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఈ 20 అప్లికేషన్లు సూచించే కేలరీల సంఖ్య 1191 నుంచి 1955 కిలోకేలరీ వరకూ ఉంటుంది’అని వివరించారు. కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినడం, సంతృప్త కొవ్వుల మోతాదును పరిమితంగా ఉంచుకోవడం, తినే పండ్లలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కేవలం 40 శాతం అప్లికేషన్లు మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా.. మంచి ఆరోగ్యానికి రోజూ వ్యాయామం చేయాలన్న సూచన చేసే అప్లికేషన్లు కూడా సగమేనని, ఈ అప్లికేషన్లు అన్నీ బరువు తగ్గడాన్ని నమోదు చేస్తున్నా.. నడుము చుట్టుకొలత గురించి పట్టించుకునేవి అతితక్కువగా ఉన్నాయని చెప్పారు. లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. మంచి స్టార్‌ రేటింగ్‌ ఉన్న అప్లికేషన్లు కూడా నాణ్యత విషయానికొచ్చేసరికి అంతంత మాత్రంగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని సుబ్బారావు తెలిపారు. చాలా అప్లికేషన్లు భారతీయ భోజనానికి సంబంధించిన కేలరీల లెక్కలు తప్పుగా చూపుతున్నాయని చెప్పారు. ‘కేలరీలు లెక్కవేసే అప్లికేషన్లలో ఉన్న లోపాలను సరిచేసే ఉద్దేశంతోనే తాము ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ను అభివృద్ధి చేశామని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు.   

మరిన్ని వార్తలు