కూటమి కూలినట్టేనా?

10 Jan, 2019 01:37 IST|Sakshi

రాష్ట్రంలో ప్రజా కూటమి కొనసాగింపుపై అనుమానాలు

ఇప్పటికీ సంయుక్తంగా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షించని వైనం

ఇకముందూ పొత్తు కొనసాగుతుందన్న కుంతియా, ఉత్తమ్‌

ఆ దిశగా చర్యలు శూన్యం.. టీడీపీపై కొరవడిన స్పష్టత

టీడీపీని కొనసాగించడంపై టీజేఎస్‌–సీపీఐ అభ్యంతరాలు?

సమీపిస్తున్న పంచాయతీ ఎన్నికలు.. పరస్పర సహకారం మిథ్యే  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజా ఫ్రంట్‌ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజులు కావస్తున్నా నేటికీ ఈ కూటమి సమీక్ష జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు ఇంతవరకు భాగస్వామ్య పక్షాలు సమావేశమవ్వలేదు. కనీసం మిత్రపక్షాల నేత లు వ్యక్తిగతంగా కలుసుకుని పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలూ లేవు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కూటమికి నేతృత్వం వహించిన పార్టీగా కాంగ్రెస్‌ సొంతంగా కొంత ఆలస్యంగానే ఫలితాలపై సమీక్ష నిర్వహించింది.

తమ అంచనాలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాల్లో గెలుపొందడంపై స్పష్టమైన కారణాలు, దారి తీసిన పరిస్థితులను మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా అంచనా వేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఫ్రంట్‌ వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఒంటరిగా పోటీ చేసుంటే మెరుగైన ఫలితాలొచ్చి ఉండేవని కాంగ్రెస్‌లో ఓ వర్గం వాదిస్తోంది. కూటమిని ఇకముందు కూడా కొనసాగిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సంకేతాలైతే ఇచ్చారు.. కానీ ఆ దిశగా చర్యలు తీసుకో లేదు. దీంతో భవిష్యత్‌లో ఈ కూటమి కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 

‘పంచాయతీ’లో సహకారం కరువు..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌ మిత్రపక్షాలు పరోక్ష సహకారం కోసం ప్రయత్నించిన దాఖలాలూ లేవు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా గ్రామ స్థాయి ల్లో పరస్పరం సహకరించుకుంటే మంచి ఫలి తాలు వచ్చే అవకాశమున్నా ఆ దిశగా ఈ పార్టీలు ఏ చర్యా తీసుకోలేదు. కనీసం క్షేత్రస్థాయిలో ఈ పార్టీల మధ్య అవసరమైన మేర అవగాహన కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మళ్లీ కూటమి కుదురుకోవడానికి, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణికి పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం కాగా దానిని కూడా ఫ్రంట్‌ వదులుకున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మిత్రత్వాన్ని పెంపొందించుకునేందుకు ఈ ఎన్నికల్లో కనీ సం సీపీఐ–టీజేఎస్‌ కూడా సహకరించుకుం టున్న పరిస్థితులు లేవు. దీంతో కూటమి కొనసాగింపు కష్టమేననే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

టీడీపీ ఉంటుందా?
కూటమిలో టీడీపీని చేర్చుకోవడం, ఎన్నికల ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ముందుండి నడిపించడం ప్రతికూలంగా మారిందని ఇప్పటికే భాగస్వామ్యపక్షాలు విశ్లేషించాయి. ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ మళ్లీ ముందుకు రావడానికి బాబు అనుసరించిన వైఖరే కారణమని ఈ పక్షాలు నమ్ముతున్నాయి. ఇకపై కూటమి కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలకు తోడు, టీడీపీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే అంశంపై స్పష్టత లోపిం చింది. టీడీపీ వల్ల నష్టం జరగలేదని కొం దరు కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌లో ఒక గ్రూపు టీడీపీని చేరడాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటు టీడీపీని ఫ్రంట్‌లో కొనసాగించడంపై సీపీఐ, టీజేఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు