ఈ–పాస్‌లో మార్పులు.. త్వరలో బిల్లుల చెల్లింపులు

10 May, 2020 02:35 IST|Sakshi

లాక్‌డౌన్‌తో గత వార్షికం చివర్లో నిలిచిన రూ.350 కోట్లు చెల్లింపునకు చర్యలు

ప్రస్తుతం కొత్త ఆర్థిక సంవత్సరం మారడంతో పాతవన్నీ వెనక్కు

వీటిని తిరిగి సమర్పించేందుకు సిద్ధమైన సంక్షేమ శాఖలు

ఇందుకనుగుణంగా ‘ఈ–పాస్‌’లో సవరణలు

సాక్షి, హైదరాబాద్‌: గత(2019–20) వార్షిక సంవత్సరం చివరి రోజుల్లో లాక్‌డౌన్‌ కారణంగా రద్దయిన బిల్లులకు మోక్షం కల్పించేందుకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ వాటిని తిరిగి ఖజానా శాఖకు సమర్పించేలా చర్యలు చేపట్టాయి. ఈమేరకు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో మార్పులు చేసేందుకు సీజీజీ(సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)కు సూచనలు చేశాయి. 2019–20 వార్షిక సంవత్సరం చివరి పది రోజులు లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.దీంతో కీలకమైన పథకాలకు చెందిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.

ఫలితంగా వార్షిక సంవత్సరం ముగియడంతో మునుపటి ఏడాది బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ఖజానా విభాగం అధికారులు తిరిగి పంపిస్తున్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌ముంట్, కళ్యాణలక్ష్మి పథకాలకు చెందిన దాదాపు రూ.350 కోట్ల విలువైన బిల్లులు వెనక్కు వచ్చాయి. వార్షిక సంవత్సరం ముగియడంతో వాటిని క్లియర్‌ చేసే వీలుండకపోవడంతో వాటిని ఖజానా విభాగం వెనక్కు పంపింది. ఈ బిల్లులను కొత్త వార్షిక సంవత్సరం ప్రకారం రూపకల్పన చేసి పంపాలని నిర్ణయించి... ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.

సాంకేతిక సమస్యలకు చెక్‌...
సంక్షేమ శాఖలకు చెందిన బిల్లుల రూపకల్పన అంతా ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారానే నిర్వహిస్తారు. పలు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ–పాస్‌ ద్వారానే వస్తాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారానే పరిశీలించి, ఆమోదించి నిధుల విడుదల కోసం ఖజానా శాఖకు పంపిస్తారు. ఈ క్రమంలో 2019–20 వార్షిక సంవత్సరం చివర్లో లాక్‌డౌన్‌ కారణంగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆ ఏడాది చివరి పది రోజుల పాటు అత్యవసర సేవలు మినహా మిగతావేవీ ముందుకు కదలలేదు. ఫలితంగా ఆ సంవత్సరానికి సంబంధించిన పలు బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో వాటిని వెనక్కు పంపాల్సివచ్చింది. ప్రస్తుతం అవన్నీ జిల్లా సంక్షేమాధికారి యూజర్‌ అకౌంట్‌లో ఉన్నాయి. వీటిలో 2020–21 సంవత్సరం తేదీల ప్రకారం సరిదిద్దాలి.

ఇందుకు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలి. ఇందులో భాగంగా సంక్షేమ శాఖ అధికారులు సీజీజీతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయించారు. సవరణలు, మార్పులు చేసేం దుకు ఉపక్రమించారు. కళ్యాణలక్ష్మి పథకం బిల్లుల్లో సవరణలు పూర్తి చేసిన అధికారులు... ప్రస్తుతం ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ పథకం బిల్లుల్లో మార్పులు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లా సంక్షేమాధికారి లాగిన్‌ ద్వారా బిల్లులను ఖజానా శాఖకు సమర్పిస్తారు. అక్కడ వాటిని ఆమోదించి టోకెన్లు జనరేట్‌ చేస్తారు. 2020–21 వార్షిక సంవత్సరం తొలి త్రైమాసికం నిధులు విడుదలైన వెంటనే వీటిని క్లియర్‌ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’తో అన్నారు.

మరిన్ని వార్తలు